పురుషాంగ, బీజకోశ మార్పిడి.. ప్రపంచంలో తొలిసారి - MicTv.in - Telugu News
mictv telugu

పురుషాంగ, బీజకోశ మార్పిడి.. ప్రపంచంలో తొలిసారి

April 24, 2018

కిడ్నీ మార్పిడి, గుండెమార్పిడి, కాలేయ మార్పిడి.. మరెన్నో మార్పిళ్ల గురించి మనకు తెలుసు. ఆధునిక టెక్నాలజీతో ఒకప్పుడు సాధ్యం కానివి ఇప్పుడు సులభసాధ్యమైపోతున్నాయి. అమెరికా వైద్యులు ప్రపంచంలోనే తొలిసారి పురుషాంగ, బీజకోశ మార్పిడి చేసి చరిత్రను సృష్టించారు.

జాన్స్ హాప్కిన్స్ హాస్పిటల్ వైద్యులు ఈ ఘనత సాధించారు. అఫ్ఘానిస్థాన్‌ యుద్ధంలో పేలుడు వల్ల తీవ్రంగా గాయపడి కాళ్లతోపాటు, జననాంగాలనూ కోల్పోయిన ఒక మాజీ సైనికుడికి ఈ సర్జరీ చేశారు. మరణించిన ఒక వ్యక్తి నుంచి అవయవాలను సేకరించి 11 మంది వైద్యులు 14 గంటల పాటు కష్టించి పూర్తిస్థాయిలో అంగమార్పిడి విజయవంతంగా పూర్తి చేశారు. పురుషాంగాన్ని ఒకస్థాయిమేరకు ఇదివరకే మార్పిడి చేశారు.

అయితే పూర్తిస్థాయిలో పురుషాంగాన్ని, బీజకోశాన్ని మార్పిడి చేయడం మాత్రమే ఇదే తొలిసారి. సైనికుడికి అంగమార్పిడి చేయడానికి ముందు చాలా సర్జరీలు కూడా పూర్తి చేశారు. దాత నుంచి అంగసంబధ రక్తనాళాలను, ఎముక మజ్జను తీసి అమర్చారు. దాత వీర్యం వల్ల భవిష్యత్తులో బిడ్డలు పుట్టకుండా ఉండేందుకు వృషణాలను మాత్రం మార్పిడి చేయలేదు. నైతిక సమస్య తలెత్తొద్దని ఈ నిర్ణయం తీసుకున్నారు. పురుషాంగ పనిచేస్తోందా లేదా అన్నాది ఇంకో వారంలో తెలుస్తుందని వైద్యులు చెప్పారు.  అంగస్తంభనకు మరో ఆరు నెలలు పట్టొచ్చన్నారు. ఏడాది తర్వాత అతడు యథావిధిగా సెక్స్ లో పాల్గొనచ్చని వెల్లడించారు. కాగా, తనకు ఇప్పుడు అంతా మామూలుగానే ఉందని సైనికుడు చెప్పాడు.

చాలా మందికి చేయాల్సి ఉంది..

అమెరికా సైనికుల్లో చాలామంది యుద్ధాల్లో పేలుళ్ల వల్ల జననంగాలను కోల్పోయారు. అయితే అంగమార్పిడి చాలా ఖరీదైన వ్యవహారం కావడం, టెక్నాలజీ కూడా అందుబాటులో లేకపోవడంతో నిరాశతో కాలం వెళ్లదీస్తున్నారు.