పెన్షన్ డబ్బులు పక్కాగా లబ్ధి దారులకు సమయానికి చేరేలా ఏపీ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. దీని కోసం గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రతి నెల ఒకటవ తారీఖున నేరుగా ఇంటికి వెళ్లి అందజేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం అక్టోబర్ నెల పెన్షన్ ఇచ్చేందుకు వెళ్తుండగా గ్రామ వాలంటీర్‌పై దుండగులు దాడి చేశారు. అతని వద్ద ఉన్నరూ. 45 వేల నగదుతో పరారు అయ్యారు. అనంతపురం జిల్లా మడకశిరలో ఇది జరిగింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు గాలింపు మొదలు పెట్టారు.
శివాపురం వాలంటీర్ ఈరప్ప పెన్షన్ పంపిణీ చేసేందుకు వెళ్తుండగా దుండగులు దాడి చేశారు. అతని కళ్ళల్లో కారం కొట్టి దాడి చేశారు. చేతిలో ఉన్న 43వేల రూపాయల నగదును దోచు కెళ్ళారు. గాయాలపాలైన అతన్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు మడకశిర అస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై పూర్తి వివరాలు రాబట్టే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారు. కాగా, ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని 61.65 లక్షల మంది పెన్షన్ దారులకు రూ.1497.88 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.