People are evacuating the village due to red ants in odisha
mictv telugu

ఎర్ర చీమల దెబ్బకు ఊరు ఖాళీ.. రాణి చీమ కోసం శాస్త్రవేత్తల వేట

September 7, 2022

ఎర్ర చీమలు కుడితే ఎంత మంటగా ఉంటుందో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి తెలుసు. కానీ, ఒడిషాలోని ఓ గ్రామంలో మాత్రం ఎర్రచీమలు పెద్ద సంఖ్యలో ముంచెత్తాయి. ఇళ్లు, రోడ్లు, పొలాలు తేడా లేకుండా భారీ సంఖ్యలో ఎర్రచీమలు చేరాయి. అడుగు పెడితే కుడుతుండడంతో చివరికి ఊరు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకెళితే.. పూరి జిల్లా పిప్లి తాలుకా బ్రహ్మం సాహి గ్రామంలో రెండు నెలల కింద ఈ బెడద మొదలైంది. ఊరికి సమీపంలో అడవి, ఆ పక్కన ఓ నది ప్రవహిస్తుండగా, నీరు ఎక్కువగా ప్రవహించడంతో అడవిలో ఉన్న చీమలు ఊరిమీద పడ్డాయి. దాంతో చాలా మంది గ్రామాన్ని ఖాళీ చేసి బంధువుల ఇళ్లకు వెళ్లగా, విషయం తెలిసిన అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, అధికారులు చేరుకొని సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. చీమలు ఎక్కడ నుంచి వస్తున్నాయో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, మూల కేంద్రంలో ఉండే రాణి చీమలను గుర్తించి చంపేస్తే ఈ బెడద తప్పుతుందని వర్సిటీ శాస్త్రవేత్త సంజయ్ మహంతి తెలిపారు. ప్రస్తుతానికి చుట్టూ ఉండే పొదల్లో చీమల మందు చల్లుతున్నామని వివరించారు. కాగా 2013లో వచ్చిన ఫాలిన్ తుఫాన్ సమయంలో ఇదే జిల్లా దండ గ్రామంపై చీమలు దాడి చేశాయి.