పొరుగు దేశం పాకిస్తాన్ తిండి లేక అలమటిస్తోంది. ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరడంతో పాటు ఆహార నిల్వలు దారుణంగా పడిపోవడంతో దుర్భర దారిద్ర్యం రాజ్యమేలుతోంది. చివరికి ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా గోధుమ పిండిని సాయుధ బలగాల పహారాలో పంపిణీ చేసేదాకా వచ్చింది. అయినా అందరికీ పిండి దక్కకపోవడంతో ఒకరి నుంచి మరొకరు గుంజుకునేదాకా వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్ లో వైరల్ అవుతోంది.
Pakistanis fighting for a bag of wheat flour
📽️: Fakhar Yousufzai#Pakistan #PakistanFlourShortage #Wheat #PakistanStampede #FoodSecurity #Agriculture pic.twitter.com/RfRpuKaRZR— Awaz-The Voice (@AwazThevoice) January 10, 2023
పిండికోసం జరిగిన తొక్కిసలాటలో ఓ వ్యక్తి మరణించడం ఆ దేశ దుస్థితికి అద్దం పడుతోంది. తన ఆరుగురు సంతానానికి తిండి పెట్టడం కోసం ఓ తండ్రి పోరాడి చివరకి ప్రాణాలు కోల్పోయాడు. సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ పంఖ్తుంఖ్వా ప్రావిన్సులలో సబ్సిడీపై ప్రభుత్వం పంపిణీ చేసే గోధుమ పిండి కోసం జనాలు పోటెత్తుతున్నారు. కొరత ఏర్పడడంతో కిలో పిండి రూ. 150 దాకా పలుకుతోంది.
ఇప్పటికే విదేశీ మారక నిల్వలు 5.8 బిలియన్ డాలర్లకు పడిపోగా, ఆహారాన్ని దిగుమతి చేసుకోవడానికి కూడా ఆ దేశం వద్ద డబ్బులు లేని పరిస్థితి ఉంది. వరదల వల్ల వ్యవసాయం ఘోరంగా దెబ్బతినడంతో తిండి గింజలకు కటకట ఏర్పడి ఆ దేశం కొట్టుమిట్టాడుతోంది. కేవలం బలూచిస్తాన్ ప్రావిన్స్కే నాలుగు లక్షల టన్నుల గోధుమ పిండి కావాలని ఆహార శాఖ మంత్రి కోరడం చూస్తే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
మరోవైపు దేశం దివాలా తీసేందుకు మరెంతో సమయం పట్టదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విదేశీ మారక నిల్వలు మరో మూడు వారాల పాటు సరిపోతాయని చెప్తున్నారు. పాకిస్తాన్ దుస్థితిని చూస్తున్న సగటు భారతీయుడు పాపం అని కామెంట్లు చేస్తున్నారు.
ద్రవ్యోల్బణం 24.5 శాతం దాటగా, డజను కోడిగుడ్లు రూ. 330, కిలో చికెన్ రూ. 650, లీటరు పాలు రూ. 190, నెయ్యి కిలో రూ. 540, నూనె రూ. 580, ఉల్లిగడ్డలు రూ. 280 పలుకుతోంది.