ప్రజల్లారా జాగ్రత్తగా ఉండండి: డబ్ల్యూహెచ్‌ఓ - MicTv.in - Telugu News
mictv telugu

 ప్రజల్లారా జాగ్రత్తగా ఉండండి: డబ్ల్యూహెచ్‌ఓ

March 16, 2022

bfdb

ప్రపంచ ప్రజల్లారా జాగ్రత్తగా ఉండండి. మళ్లీ కరోనా కేసులు ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా పెరుగుతున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) హెచ్చరించింది. బుధవారం కరోనా కేసులకు సంబంధించి పలు విషయలను వెల్లడించింది. ”ఒమిక్రాన్ వ్యాప్తి ఇంకా తీవ్ర స్థాయిలోనే ఉంది. స్వల్ప విరామం తర్వాత వైరస్ ప్రభావంతో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా కరోనా నిబంధనలు తొలగించిన ప్రాంతాల్లోనే వైరస్ తిరగబడుతోంది” అని తెలిపింది.

అంతేకాకుండా చైనా, మరికొన్ని దేశాల్లో కరోనా ఉదృతి మళ్లీ పుంజుకుంటుదని డబ్యూహెచ్ఓ ఎపిడెమిలాజిస్ట్ మరియా వాన్ ఫొర్రోవ్ అన్నారు. “కొవిడ్ 19 అంతమవుతుందా? లేదా మరింత ఉదృతంగా ఉండబోతోందా? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటికి సమాధానాలు వెతికే ముందు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఇంకా తీవ్ర స్థాయిలోనే ఉంది. ఇటీవల కొన్ని వారాల పాటు తగ్గుముఖం పట్టిన కేసులు తాజాగా మళ్లీ పెరుగుతున్నాయి. పరీక్షల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. కేసులు పెరుగుతున్నాయి” అని మరియా ట్విటర్ వేదికగా వెల్లడించారు.

మరోపక్క చైనాలో గతకొన్ని రోజులుగా కరోనా మళ్లీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన చైనా ప్రభుత్వం మరోసారి ఆంక్షల బాటపట్టింది. కొన్ని ప్రదేశాల్లో సంపూర్ణ లాక్‌డైన్ ప్రకటించింది. మరికొన్ని ప్రాంతాల్లో కఠినమైన ఆంక్షలను అమలు చేసింది.