ఐఫోన్ వద్దు.. ఉల్లే ముద్దు: అబిబస్ ఆఫర్‌కు ఫుల్ గిరాకీ - MicTv.in - Telugu News
mictv telugu

ఐఫోన్ వద్దు.. ఉల్లే ముద్దు: అబిబస్ ఆఫర్‌కు ఫుల్ గిరాకీ

December 12, 2019

3 kg onions.

ఉల్లిని కోస్తే కన్నీళ్లు వచ్చే రోజులు పోయాయి. కొనబోతేనే కన్నీళ్లు కారుతున్నాయి ఇప్పుడు.దేశవ్యాప్తంగా రోజురోజుకు ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్‌లో బంగారు ఆభరణాలు, విలువలైన వస్తువుల కంటే ఉల్లికే అధిక డిమాండ్‌ ఉందని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ పరిస్థితుల్లో ఉల్లిని కొనాలంటే ప్రజలు వెనకాముందు అవుతున్నారు. ఉల్లి లేకుండా కూరను ఊహించడం కష్టంగా ఉంది. కొందామంటే అంతకన్నా కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో కొన్ని స్మార్ట్ ఫోన్ల కంపెనీలు ఫోన్ కొంటే కిలో, రెండు కిలోల ఉల్లిపాయలను ఉచితంగా అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆన్‌లైన్‌ పర్యాటక సంస్థ అబిబస్‌.కామ్‌ కూడా ఓ వినూత్న ఆఫర్‌ను ప్రకటించింది. తమ వెబ్‌సైట్‌ ద్వారా గోవా ట్రిప్‌ బుక్‌ చేసుకున్నోళ్లకు 3 కిలోల ఉల్లిపాయల బహుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ ఆఫర్‌ ద్వారా ప్రతి రోజు 20 మందిని విజేతలుగా ప్రకటించి.. వారికి 3 కిలోల ఉల్లిని ఇంటికి డెలివరీ చేస్తామని తెలిపింది. డిసెంబర్‌ 10న ప్రకటించిన ఈ ఆఫర్‌కు భారీ స్సందన లభిస్తోందని సంస్థ నిర్వాహకులు చెప్పారు. 

ఈ ఆఫర్‌ను చూసి చాలామంది గోవా ట్రిప్ కోసం టికెట్లు బుక్ చేసుకుంటున్నారని అన్నారు. ఈ ఆఫర్‌తో పాటు మరో ఆఫర్‌ను కూడా అబిబస్ ప్రకటించింది. గోవా టూర్‌కు అధిక డబ్బులు వెచ్చించినవారికి ఆపిల్‌ ఐ ఫోన్ లేదా ఈ-బైక్‌లను గెలుచుకునే బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. అయితే విచిత్రం ఏంటంటే  అధిక శాతం వినియోగదారులను బుకింగ్‌లో ఉల్లిపాయ బహుమతినే ఎంచుకుంటున్నట్లు ఆశ్చర్యం వ్యక్తంచేసింది. ఈ సందర్భంగా ఆ సంస్థ సీఈవో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. అత్యధిక ​వినియోగదారులు గోవా పర్యటనకంటే కూడా ఉల్లిపాయాలకే ప్రాధాన్యత ఇవ్వడం చూసి మేము ఆశ్యర్యపోతున్నామని చెప్పారు. 

ఈ ఆఫర్‌కు వచ్చిన స్పందన చూస్తే చాలా ఆనందంగా ఉందని అన్నారు. తాము వినియోగదారులకు మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఆఫర్లు అందిస్తున్నామనే సంతృప్తి కలిగిందని పేర్కొన్నారు. తమ నిర్ణయం సరైందనే నమ్మకం వచ్చిందని అన్నారు. ‘పర్యాటక ప్రదేశాల ఎంపికలో.. వెనుకంజలో ఉండే గోవా ఈ ఆఫర్‌తో మొదటి సారిగా రెండవ స్థానంలో నిలిచింది. డిసెంబర్‌ 15 వరకు ఉండే ఈ ఆఫర్‌ కోసం అబిబస్‌ వెబ్‌సైట్‌ ద్వారా గోవా టూర్‌ బుక్‌ చేసుకుని పోటీలో నిలువవచ్చు’ అని తెలిపారు.