తన తండ్రి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు, ఎందుకు హత్య చేశారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన కుమార్తె సునీతారెడ్డి అన్నారు. వైఎస్ వివేకా నాలుగో వర్ధంతి సందర్భంగా తండ్రి సమాధి వద్ద ఆమె నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి హత్య కేసులో సొంత కుటుంబసభ్యుల మీద ఆరోపణలు చేస్తున్నాననే విషయం తనకు తెలుసనీ, అయితే హత్య కేసులో వారికి ప్రమేయం ఉందని నమ్ముతున్నందునే సీబీఐకి అన్ని విషయాలు తెలియజేస్తున్నానని చెప్పారు. ఇలాంటి హత్యలు కడప, కర్నూలు వంటి ప్రాంతాల్లో మామూలే కదమ్మా అని తన తండ్రి గురించి అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాన్నను ఎవరు హత్య చేశారో తెలుసుకోకుండా ఎలా వదిలిపెట్టగలను? అని వ్యాఖ్యానించారు. కడప అరాచకాలు తగ్గాయి అనుకున్నానని.. కానీ ప్రస్తుత పరిస్థితి అలా లేదని, ఎక్కడికెళ్లినా కడపలో అరాచకాల గురించే మాట్లాడుతున్నారన్నారు.
ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలను కొన్ని ప్రభుత్వాలు ప్రభావితం చేయకూడదని పోలీసుల మీద ఒత్తిడి పెట్టకుండా వాళ్ల పని వాళ్లని చేయనీయాలని పేర్కొన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఎవరైనా సరే.. ఎంతటి వారైనా సరే బయటకు రావాలని సునీత పేర్కొన్నారు. ఎదిగే పిల్లలు తప్పు చేస్తేనే ఖండిస్తామని.. అలాగే పెద్దలు తప్పు చేసినా వదిలిపెట్టకూడదన్నారు. కడపకు అనేక విద్యాసంస్థలు వచ్చాయి కాబట్టి అరాచకాలు తగ్గాయనుకున్నానన్నారు. కానీ తన తండ్రి హత్య తర్వాత అరాచకాలు తగ్గలేదని రుజువైందన్నారు. తప్పు చేసిన వాళ్లకి శిక్షపడితేనే నేరాలు తగ్గుతాయని వైఎస్ సునీత చెప్పారు. ప్రస్తుతం తన తండ్రి హత్య కేసు విచారణ దశలో ఉందని.. ఇప్పుడు ఇంతకు మించి ఇంకేమీ మాట్లాడబోనన్నారు.