People of Rajendranagar are demanding the resignation of MLA Prakash Goud
mictv telugu

రాజీనామా చేయమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వెంట పడ్డ జనం.. వీడియో వైరల్

November 5, 2022

తెలంగాణలో కొత్త ట్రెండ్ మొదలైంది. ఎమ్మెల్యేల రాజీనామాలతో ఉప ఎన్నికలు వస్తుండగా, గెలుపు కోసం అధికార టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గంలో అభివద్ధి పనులను పరుగులు పెట్టిస్తోంది. దుబ్బాక, హుజూరాబాద్, నాగార్జున సాగర్ ఎన్నికల్లో ఇదే జరిగింది. రీసెంట్‌గా మునుగోడులో జరిగిన ఉప ఎన్నికల్లో అయితే అభివృద్ధి పరుగులు పెట్టింది. అంతేకాక, తమ అభ్యర్ధిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని భవిష్యత్ ముఖ్యమంత్రి కేటీఆర్ స్వయంగా ప్రజల సమక్షంలో ప్రకటించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల అమలు శరవేగంగా జరిగాయి. దీంతో రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల ప్రజలు తమ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. మీరు కూడా రాజీనామా చేస్తే మన ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని కోరుతున్నారు. మొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని అక్కడి ఓటరు రాజీనామా చేయమని కోరారు. తాజాగా రాజేంద్రనగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌‌‌కి కూడా ఈ అనుభవం ఎదురైంది.

నియోజకవర్గ పర్యటన చేసిన ప్రకాశ్ గౌడ్‌ని ప్రజలు రాజీనామా చేయమని వెంటపడ్డారు. మీరు రాజీనమా చేయండి. తిరిగి మిమ్మల్నే ఎమ్మెల్యేగా గెలిపిస్తామని డిమాండ్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. పక్కనున్న వ్యక్తి ‘ఏ గింత దానికి రాజీనామా ఎందుకు’ అని చెప్పగా ‘మరి ఏం చేయమంటావు బావ. ఏ పనులు జరగట్లేదు. మన ఏరియా డెవలప్ అయితలేదు’ అని ఓ యువకుడు చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇలాగే ప్రతీ నియోజకవర్గంలోనూ జరుగుతోందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా వాట్సాప్ గ్రూపుల్లో తమ తమ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో అయినా సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయని వారు ఆశిస్తున్నారు.