People of Telangana interested for booster dose
mictv telugu

బూస్టర్ డోస్ కోసం ఎగబడుతున్న తెలంగాణ ప్రజలు

December 26, 2022

దేశంలో కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్-7 వ్యాప్తి ఆందోళనకరంగా మారుతోంది. ఇప్పటికే ఈ వేరియంట్ చైనాను గజగజ వణికిస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ వ్యాక్సిన్‌కు డిమాండ్ ఏర్పడింది. 18 ఏళ్ల వయసు దాటిన వారందరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. దీంతో ఎందుకైనా మంచిదనే ఆలోచనతో ప్రజలు బూస్టర్ డోస్ తీసుకునేందుకు ఆసుపత్రులకు వస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో గత మూడు రోజుల్లో బూస్టర్ డోస్ కోసం వచ్చే వారి సంఖ్య.. అంతకుముందు రోజువారీ సగటుతో పోలిస్తే 400 శాతం పెరిగినట్టు వైద్య శాఖ వర్గాలు వెల్లడించాయి.

క్రిస్ మస్ రోజు కూడా ప్రజలు బూస్టర్ డోస్ కోసం ఆసక్తి చూపించారట. ఈ నెల 21న 646 మంది, 22న 1,631 మంది, 23న 2,267 మంది, 24న 3,380 మంది, క్రిస్ మస్ రోజున 1,500 మంది (పండుగ కావడంతో తగ్గింది) బూస్టర్ డోస్ తీసుకున్నారు. సాధారణ రోజుల్లో బూస్టర్ డోస్ తీసుకునే వారి సంఖ్య వందల్లోనే ఉంటోంది. ఇప్పటివరకు దేశంలో 23.8 శాతం మంది బూస్టర్ డోస్ తీసుకున్నారు. ఈ జాబితాలో 47.6 శాతంతో తెలంగాణ టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ విషయం స్వయంగా మంత్రి హరీష్‌రావు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 46.3 శాతంతో రెండో స్థానంలో నిలవడం విశేషం.