ఉక్రెయిన్ ప్రజలారా.. రష్యాను నమ్మకండి: జెలెన్ స్కీ - MicTv.in - Telugu News
mictv telugu

ఉక్రెయిన్ ప్రజలారా.. రష్యాను నమ్మకండి: జెలెన్ స్కీ

March 30, 2022

రష్యా దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ దేశంపై యుద్ధం ప్రకటించి, దాదాపు 35 రోజులు గడించింది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ దేశం అల్లకల్లోలం అయింది. కోట్ల సంపద నాశనం అయింది. అంతేకాకుండా లక్షల మంది ఉక్రెయిన్‌ను విడిచి వెళ్లిపోయారు. మరికొంతమంది రష్యా దాడులకు బలై పోయారు. ఈ నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య ఇప్పటికే ఏర్పాటు అయిన పలు శాంతి సమావేశాలు విఫలమైన విషయం తెలిసిందే.

 

ఈ సందర్భంగా తాజాగా టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతి చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. కానీ, ఈసారి ఇరుదేశాలు జరిపిన చర్చలు ఫలించాయి. ఉక్రెయిన్ దేశం రష్యా దేశం పెట్టిన ఒప్పందాలను అంగీకరించడంతో రష్యా సేనలు వెనక్కి తీసుకుంటామని, యుద్దాన్ని ఆపేవేస్తామని రష్యా దేశం ప్రకటించింది. ఈ క్రమంలో బుధవారం ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ స్పందించారు. ”చర్చల ఫలితం సానుకూలంగానే ఉంది. కానీ రష్యాను మేము ఇప్పుడే నమ్మలేము. మా ప్రజలేమీ అంత అమాయకులు కారు. చర్చలకు సంబంధించిన ఫలితాలు చేతల్లో పూర్తిగా అమలైనప్పుడే రష్యాను నమ్ముతాం” అని ఆయన అన్నారు.

అంతేకాకుండా ఉక్రెయిన్ సైనికుల ధైర్య సాహసాల వల్లే రష్యా సైన్యం వెనక్కు తగ్గుతోందని, అయినా, ఆ దేశాన్ని తాము నమ్మేది లేదని అన్నారు. పరిస్థితులు ఇంకా మెరుగుపడలేదని, ప్రజలెవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు. దేశంపై రష్యా ఇంకా దాడులు కొనసాగించే అవకాశం ఉందని జెలెన్ స్కీ స్పష్టం చేశారు.

మరోపక్క రష్యా దాడుల నుంచి ఉక్రెయిన్ ప్రజలు చాలా నేర్చుకున్నారని, దేశ సార్వభౌమత్వంపై ఎప్పటికీ రాజీపడరని తేల్చి చెప్పారు. కాగా, ఉక్రెయిన్ రాజధాని కీవ్ సరిహద్దుల నుంచి రష్యా తన దళాలను చాలా తక్కువగా వెనక్కు తీసుకెళుతోందని, యుద్ధం నుంచి రష్యా ఇంకా పూర్తిగా తప్పుకోలేదని అమెరికా హెచ్చరించింది.