దండం తల్లీ, బాబూ.. ఇంట్లోకెళ్లండి.. పోలీసుల రిక్వెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

దండం తల్లీ, బాబూ.. ఇంట్లోకెళ్లండి.. పోలీసుల రిక్వెస్ట్

March 22, 2020

 

కరోనా వైరస్‌ మహమ్మారిపై దేశం యావత్తు యుద్దానికి సూచికగా జనతా కర్ఫ్యూను పాటిస్తోంది. దీంతో ప్రజలు అందరూ ఇళ్లల్లో ఉండిపోయారు. రోడ్లు, వీధులు నిర్మానుష్యంగా బోసిపోయి కనబడుతున్నాయి. దుకాణాలు, కార్యాలయాలు, సినిమా హాళ్లు, పార్కులు, రవాణా సౌకర్యాలు మూత పడటంతో జనాలు ఇళ్లల్లో ఉండిపోయారు. అత్యవసర విధుల వారు తప్ప మిగతావారు అడుగు బయట పెట్టకుండా.. ఇంటి దగ్గరే ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో జనతా కర్ఫ్యూ విజయవంతంగా కొనసాగుతోంది. 

జనతా కర్ఫ్యూను పోలీసులు చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. బయట వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే ఇళ్లలోకి వెళ్లమని చెబుతున్నారు. కూడళ్ల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేసి.. వాహనాలపై ఎవరైనా బయటకు వస్తే తిరిగి వెనక్కు పంపిస్తున్నారు. మీడియాలో పనిచేసేవారిని ఐడీ చూపించి వదులుతున్నారు. కొందరు అదే పనిగా బయటకు వస్తుంటే వారికి చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఇళ్లల్లోకి వెళ్లండి అని బతిమాలుతున్నారు. దయచేసి జనతా కర్ఫ్యూకి సపోర్ట్ చేయండి అంటున్నారు. ఇలాంటి దృశ్యాలు పలు చోట్ల కెమెరా కంటికి చిక్కాయి. కాగా, ఇళ్లల్లో ఉంటున్నవారు ఇది మనమంచి కోసమే కదా.. బయటకు వెళ్లకపోవడమే మంచిది అని జనతా కర్ఫ్యూకు సహకరిస్తున్నారు.