టిక్‌టాకర్ల క్రియేటివిటి శృతిమించిపోతోంది. వ్యూస్, లైక్స్ కోసం ఇష్టం వచ్చినట్లు వీడియోలు తీస్తూ తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. డబ్బు వ్యామోహంతో.. వయస్సు మళ్లిన ఆడవారితో వింత వింత వీడియోలు తీస్తూ ఇబ్బందిపెడుతున్నారు. ఆ అమాయక మహిళలు కూడా తమ పొట్ట నింపుకునేందుకు, టిక్‌టాకర్లు ఇచ్చే కూలీ డబ్బులు కోసం ఈ పని చేస్తున్నారు. ఇండోనేషియాలోని కొన్ని ప్రాంతాలు ఇలాంటి దారుణాలకు వేదికగా నిలుస్తున్నాయి.
ఇండోనేసియాలోని లొంబొక్ ప్రాంతంలో పేదరికం ఎక్కువ. స్థానికంగా ఉంటున్న టిక్ టాక్ క్రియేటర్లు.. ఈజీగా డబ్బు సంపాదించొచ్చని అక్కడి వృద్ధ మహిళలు మాయమాటలు చెప్పి వీడియోలు తీస్తున్నారు. ఎక్కువ ఆదాయం ఆశ చూపించడంతో ఆ మహిళలు కూడా వారు ఎలా చెబితే అలా చేస్తున్నారు. ఎండలో ఎండుతూ, చలిలో ఒణుకుతూ, వానలో తడస్తూ.. ఇలా ఆరోగ్య సమస్యలను సైతం లెక్క చేయకండా తమ కుటుంబాల పోషణ కోసం వీటిపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. వారు చెప్పినట్లు బురద నీటిలో కూర్చోవడానికి కూడా అంగీకరిస్తున్నారు. అలాంటి వీడియోలు లైవ్ స్ట్రీమ్‌లో ప్రసారం చేయడం.. ఆన్‌లైన్ ద్వారా అది చూసిన ప్రేక్షకుల వల్ల క్రియేటర్లకు భారీగా ఆదాయం అందుతోంది. కానీ ఇదంతా చేసిన మహిళలకు మాత్రం కూలీ రూపంలో అతి తక్కువ మొత్తాలను ఇస్తున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు.
అయితే తమకు రోజువారీ వచ్చే కూలీ కన్నా టిక్‌టాక్ క్రియేటర్లు ఇచ్చే డబ్బు ఎక్కువగా ఉందని ఆ అమాయక మహిళలు చెబుతుండటం గమనార్హం. తమకు కష్టంగా ఉన్నా వీటిని భరిస్తామని వారు అంటున్నారు. దీని ద్వారా వచ్చే ఆదాయంతో తన మనవళ్లు, మనవరాళ్లకు కనీసం ఒక్కపూటైనా కడుపు నిండుతోందని వారు తెలిపారు. అయితే ఇటువంటి చర్యలు దుర్మార్గమని క్రియేటర్లపై కేసులు పెట్టాలని ప్రజాసంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు.
అమెరికా తరువాత ఇండోనేసియాలో టిక్‌టాక్ యూజర్లు 106 మిలియన్ల మంది ఉంటారని అంచనా. అలాంటి వీడియోలు టిక్‌టాక్‌లో విరివిగా ప్రచారంలోకి రావడంతో ఇండోనేషియా అధికారులు స్పందించారు. వెంటనే వాటిని నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ వీడియోలను టిక్‌టాక్ నుంచి తొలగించాలని ఆ సంస్థకు లేఖ రాశారు. కొందరు మహిళలు కనీసం ఏడు, ఎనిమిది గంటలు ఈ నీటిలోనే ఉండటం బాధాకరమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం నుంచి వచ్చిన లేఖలకు బాధ్యత వహిస్తూ ఆ వీడియోలను టిక్‌టాక్ సిబ్బంది తొలిగించినట్లు సమాచారం.