రేప్ టూరిజం..దిశ ఘటన స్థలంలో సెల్ఫీలు - MicTv.in - Telugu News
mictv telugu

రేప్ టూరిజం..దిశ ఘటన స్థలంలో సెల్ఫీలు

December 3, 2019

 

People Rush 01

ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో మనుషులు రోజు రోజుకు విజ్ఞత మర్చిపోతున్నారు. మంచి,చెడు అనే భావన లేకుండా ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలకు ఫోజులు ఇస్తున్నారు. ఇటీవల బంజారాహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని చనిపోతే ఓ వ్యక్తి వచ్చి సెల్పీ దిగడంపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా దిశను అత్యాచారం చేసిన ప్రాంతంలోనూ ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది. అటు వెళ్తున్నవారు తొండుపల్లి టోల్ ప్లాజా వద్ద ఆగి మరీ ఫొటోలు తీసుకుంటున్నారు. 

దిశను అత్యంత పాశవికంగా హింసించిన స్థలం వద్ద ఆగి కొంత మంది ఆవేదన వ్యక్తం చేస్తుండగా.. మరి కొందరు మాత్రం సెల్ఫీలు దిగుతూ పిచ్చి ఆనందం పొందుతున్నారు. కార్లు,బైకులు పార్కింగ్ చేసి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తుండటంతో అదేదో టూరిస్టు స్పాట్‌లా మారిపోయింది. దీనిపై పోలీసులతో పాటు పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలుకు జరిగిన ఘోరమైన ఘటన ప్రాంతంలో ఇలా చేయడం సరికాదని అంటున్నారు. మరికొంత మంది అయితే ఆమె శవాన్ని కాల్చిన బ్రిడ్జి కిందకు వెళ్లి మరి ఫొటోలు తీస్తున్నారు. 

ఇలా ఫొటోలు, సెల్ఫీ దృశ్యాలు తీసుకునే వారు ఆ ప్రాంతంలో దర్శనం ఇస్తుండటంతో ఎవరిని అటుగా వెళ్లకుండా నియంత్రించాలని పలువురు కోరుతున్నారు. కాగా ఇప్పటికే టోల్ గేట్ వద్ద ఉన్న ఖాళీ స్థలంలోని ముళ్లపొదలను తొలగించారు. రోడ్డుపక్కనే ఉన్న గోడను కూడా కూల్చేశారు. లారీలు, ఇతర వాహనాలు ఆగకుండా చర్యలు చేపట్టారు.