వర్షాకాలంలో ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి - MicTv.in - Telugu News
mictv telugu

వర్షాకాలంలో ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి

June 15, 2022

 

వేసవి కాలం అయిపోయి వానాకాలం వచ్చేసింది. దీని వల్ల వాతావరణం చల్లబడి శరీరానికి, మనసుకు అహ్లాదం కలిగించినా, వరుస వర్షాలు, అధిక వర్షాల వల్ల ఆరోగ్యానికి ముప్పు కూడా ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్రిముల దాడి, రోగాల తాకిడి ఈ కాలంలోనే ఎక్కువగా ఉంటాయని, వాటిని నిరోధించడానికి క్రింది జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

1. పోషకాహారం : రోగాలకు వర్షాకాలం అనుకూలంగా ఉంటుంది. వర్షాలు పడడం వల్ల అప్పటివరకు దోమలు, ఈగలు వంటి కీటకాల గుడ్లు పగిలి జీవులుగా రూపాంతరం చెందుతాయి. అందువల్ల వైరల్ ఫీవర్లు, ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. తరచూ జలుబు, దగ్గు వంటివి రావడంతో అనారోగ్యానికి గురయ్యే అవకాశముంది. వాటిని నిరోధించడానికి తాజా పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, ముడి ధాన్యాలు వంటివి తీసుకోవాలి. పసుసు, అల్లం, వెల్లుల్లి వంటివి ఎక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది.

2. తగినంత నీరు : వానాకాలంలో వాతావరణం చల్లగా ఉండడంతో మంచి నీరు ఎక్కువగా తీసుకోవాలనిపించదు. దాని వల్ల శరీరం డీ హైడ్రేషన్‌కు గురవుతున్నా మనం గమనించలేము. అందుకని తగినంత నీరు తాగడం మరచిపోకండి. దీని వల్ల చర్మంలో ఆయిల్ ప్రొడక్షన్ కంట్రోల్‌లో ఉంటుంది. అల్లం టీ, గ్రీన్ టీ వంటివి తీసుకోవచ్చు. కాఫీ, టీ, సోడాలకు దూరంగా ఉండండి.

3. రోజువారీ వ్యాయామం : వ్యాయామం చేయడం ఏకాలంలోనైనా ఉపయోగపడేదే. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరిగి, క్రిములపై పోరాడడానికి సహాయపడుతుంది. శరీరం చురుగ్గా ఉండి రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. వారంలో కనీసం ఐదు రోజుల పాటు స్కిప్పింగ్, రన్నింగ్, యోగా, సైకిల్ తొక్కడం వంటివి చేయాలి. పాజిటివ్ ధోరణికి ఈ ప్రక్రియ దోహదపడుతుంది.

4. స్నానం చేయడం : ఎండాకాలంలో వేడి, ఉక్కపోత వలన చాలా మంది రోజుకు రెండు సార్లు స్నానం చేసి ఉంటారు. దీనిని వానాకాలంలోనూ కొనసాగిస్తే మంచిది. చాలా మంది వానాకాలంలో స్నానంపై పెద్దగా దృష్టి పెట్టరు. కానీ, రోజుకు రెండు సార్లు స్నానం చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఉదయం ఎలాగూ చేస్తాం, కానీ సాయంత్రం పనులు ముగించిన తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే అనేక అలర్జీలను నివారించవచ్చు. అంతేకాక, వాతావరణంలోని అధికతేమ కారణంగా చర్మంపై పేరుకుపోయిన మురికిని తొలగించవచ్చు.