ప్రజా గాయకుడు గద్దర్ కాసేపటి కింద ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. భార్య, కుమారుడితో కలిసి వెళ్లిన గద్దర్.. ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీతో కలిసి రాహుల్‌తో సమావేశమయ్యారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యామానికి మద్దతు ఇవ్వాలని రాహుల్ ఈ సందర్భంగా గద్దర్‌ను కోరారు. మహాకూటమికి అనుకూలంగా ప్రచారం చేస్తానని గద్దర్ చెప్పారు. గద్దర్‌కు ఉత్తర తెలంగాణ, సింగరేణి ప్రాంతాల్లో ప్రచార బాధ్యతలను అప్పగించనున్నట్లు సమాచారం.కాంగ్రెస్ పార్టీలో ఉన్న తన కుమారుడు సూర్యకిరణ్‌కు పార్టీ తరపున బెల్లంపల్లి సీటుతో పాటు మరో ఇద్దరు అనుచరులకు గద్దర్ సీట్లు కోరినట్లు సమాచారం. బెల్లంపల్లి టికెట్ ఆశిస్తున్న సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ను పోటీ నుంచి తప్పించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డిని కోరతారని భావిస్తున్నారు.
అయితే రాహుల్‌తో భేటీ అనంతరం గద్దర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను ఏ పార్టీలో చేరడం లేదు. నేను ఓ ప్రజా గాయకుడిని, ప్రజల కోసమే పనిచేస్తాను. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పైన ఇండిపెండెంట్‌గానే పోటీ చేస్తా’ అని అన్నారు.