జమ్మికుంటలో రోజూ జనగణమనే... - MicTv.in - Telugu News
mictv telugu

జమ్మికుంటలో రోజూ జనగణమనే…

August 18, 2017

జాతీయగీతం ’జనగణమన అధినాయక జయహే..’ను ఎప్పుడు పాడతాం? పంద్రాగస్టు, రిపబ్లిక్ డే వగైరా జాతీయ వేడుకల్లో కదా. స్కూళ్లలో అయితే రోజూ పాడుతుంటారనుకోండి. కానీ ఏ ఊళ్లోనైనా రోజూ జనగణమణ పాడతుంటారా? ఆ ఊరిని మీరెప్పుడైనా చూశారా? చూడకపోతే కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటకు వెళ్లండి..

జమ్మికుంటలో రోజూ ఉదయం 8 గంటలు కొట్టగానే ఠంచనుగా జాతీయగీతం హోరుమంటూ వినిపిస్తుంది. మొత్తం 16 చౌరస్తాల్లో పోలీసులు మైకుల్లో నేషనల్ యాంథమ్ ను రెండు నిమిషాలపాటు వినిపిస్తున్నారు. ఇది మొదలవగానే చుట్టుపక్కలున్న జనం, వాహన చోదకులు అప్రమత్తం అవుతారు. అందరూ గౌరవంగా లేచి నిలబడి గొంతులు సవరించుకుని జనగణమన గీతాన్ని ఆలపిస్తారు. ఇదంతా చూడ్డానికి వింతగా ఉన్నా, ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడానికే ఇలా చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.

ఈ పంద్రాగస్టు నుంచి రోజువారీ జనగణమన ప్రారంభించారు. జాతీయ గీతం వినిపించే సమయంలో ప్రజలు ఏం చేయాలో చెప్పడానికి వలంటీర్లను కూడా నియమించారు.

‘‘కొత్త తరానికి జనగణమన విశిష్టత గురించి సరిగ్గా తెలియడం లేదు. మాతృదేశం, దేశభక్తి విలువలను ప్రచారం చేయడానికి ఈ వినూత్నకార్యక్రమం చేపట్టాం. ప్రజలు కులమతాలకు అతీతంగా జాతీయ గీతాన్ని పాడుతున్నారు.. ’’ అని సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. ప్రశాంత్ రెడ్డి అన్నారు. తమ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, ఎలాంటి సమస్యలూ తలెత్తడం లేదని అన్నారు.