‘పీకే’ సినిమాలో గ్రహాంతర వాసి భూమి మీదకు వచ్చి వింత వింత పనులు చేయడం చూశాం. అలాగే కొన్ని సినిమాల్లో, ఫిక్షన్ కథల్లో, చదువుకునే పాఠ్యాంశాల్లో మనం గ్రహాంతర వాసుల గురించి తెలుసుకున్నాం. కానీ, ఇంతవరకు వాటిని చూసిన దాఖలాలు లేవు. అన్నీ ఊహాగానాలే వినబడుతున్నాయి. ఏలియన్స్ ఫ్లైయింగ్ సాసర్స్లో వస్తారని, వింత వింత ఆకృతిలో ఉంటారని చెబుతుంటే, గ్రాఫిక్ చిత్రాలలో చూశాం, విన్నాం. అయితే ఉత్తర ప్రదేశ్లో కొందరికి ఆకాశంలో ఎగురుతున్న ఓ ఆకారం కనిపించింది. దాన్ని చూడగానే వారంతా షాక్కు గురయ్యారు. గ్రహాంతరవాసి దూసుకు వస్తోందని చెప్పి అక్కడినుంచి పారిపోయారు. అయితే, ఆ ఎగురుతున్న ఆకారం కొంతసేపటి తరువాత నోయిడా సమీపంలోని ఓ కాలువలో పడిపోయింది.
అది ఖచ్చితంగా గ్రహాంతరవాసియే అని అప్పటికే పుకార్లు షికార్లు చేయడంతో జనాలు దానిని చూడటానికి ఎగబడ్డారు. అదేవిధంగా దాని దగ్గరకు వెళ్లి చూసేందుకు భయపడ్డారు. తీరా దానిని చూసి షాక్ అయ్యారు. అది గ్రహాంతరవాసి కాదు గాలితో ఊదిన బెలూన్ అని తెలియడంతో ఉసూరుమన్నారు. అచ్చంగా ఐరన్ మ్యాన్ ఆకృతిలో ఉన్న బెలూన్ కావడంతో ఆకాశంలో దాన్ని చూస్తే ఎవరైనా అలానే భ్రమపడతారని అంటున్నారు. చాలా టెన్షన్ పడ్డామని అని చల్లగా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కాగా, అమెరికాలోని ఏరియా 51లో గ్రహాంతర వాసులు ఉన్నారని, వాటిపై ప్రయోగాలు చేస్తున్నారని రోజుకొక వార్త బయటకు వస్తుంటుంది. ఆ వార్తలు నిజమా కాదా అన్నది ఇప్పటివరకు ఎవరూ చెప్పలేకపోయారు.