తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని, అసలు టీడీపీ చంద్రబాబుది కాదు ఎన్టీఆర్ దేనని సూటిగా చెప్పారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని, టీడీపీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందనే భావన అక్కడి ప్రజల్లో ఉందని అభిప్రాయపడ్డారు. పార్టీపై చంద్రబాబుకు ప్రేమ ఉంటే ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రిని చేయాలన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చంద్రబాబు ఫెయిలయ్యారని, టీడీపీని చంద్రబాబు లాక్కున్నారని వ్యాఖ్యానించారు. ఖమ్మంలో బుధవారం చంద్రబాబు సభ నిర్వహించిన నేపథ్యంలో ఎర్రబెల్లి పై విధంగా స్పందించారు. అటు మరో మంత్రి గంగుల కూడా చంద్రబాబుపై మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంపద పెరిగిందని, దాన్ని దోచుకోవడానికే తెలంగాణలో సభ పెట్టారని విమర్శించారు. మోదీ సూచనల మేరకే చంద్రబాబు, పవన్, షర్మిల, కేఏ పాల్ వచ్చారని, ఆంధ్రామూలాలున్న వీరికి ఇక్కడేం పని అని ప్రశ్నించారు. కాగా, చంద్రబాబు ఏపీలో పర్యటించే సమయంలోనూ ఎన్టీఆర్ కి మద్ధతుగా అభిమానులు ప్రదర్శనలు చేశారు. ఎన్టీఆర్ జెండాలతో సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. పార్టీలో ఎన్టీఆర్ కి బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు మౌనమే పాటించారు. ఖమ్మంలో జరిగిన సభలోనూ జై ఎన్టీఆర్ నినాదాలు వినిపించాయి.