కోడి నుంచి పులి వరకు ఏ జీవి మాంసాన్ని పలువురు వదలడం లేదు. అవకాశం వస్తే ఆలస్యం చేయకుండా లాగించేస్తున్నారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం అక్కపాలెం అటవీ ప్రాంతంలో పులి మాంసాన్ని వండుకుని తినేశారు కొందరు వ్యక్తులు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం కలకలం రేపుతోంది. పుల్లెల చెరువు మండలంలోని అక్కెపాలెం అటవీ ప్రాంతంలో పులులు సంచరిస్తున్నాయని అధికారులకు సమాచారం అందింది. పులి యొక్క పాదముద్రలను కూడా అధికారులు గుర్తించారు. దీంతో పరిశర ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అదేవిధంగా విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని సూచించారు.
పులి మాంసాన్ని కొంతమంది వ్యక్తులు వండుకొని తిన్నారనే వార్త ఒక్కసారిగా గుప్పుమంది. పులిగోళ్ల పంపకాల విషయంలో వారి మధ్య తేడాలు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం అధికారులకు కూడా చేరడంతో విచారణ చేపట్టారు. 12 మందిని గుర్తించి..అందులో ఇద్దరిని రహస్యంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కరెంట్ తీగలు తగిలి పులి చనిపోవడంతో వండుకొని తినేసామని వారు చెప్పినట్లు సమాచారం. పులి మాంసాన్ని వండుకున్న వారంతా దాని చర్మాన్ని సమీపంలోని బావిలో పడేసినట్టు అనుమానిస్తున్నారు. ప్రమాదవశాత్తు కరెంట్ తీగలకు తగిలి పులి చనిపోయిందా..లేదా వేటాడి చంపేశారా అనే కోణంలో అటవీ అధికారులు విచారిస్తున్నారు.