People who buried a child alive..Finally
mictv telugu

బతికుండగానే చిన్నారిని పాతిపెట్టిన వ్యక్తులు..చివరికి

August 5, 2022

గుజరాత్‌ రాష్ట్రం సంబర్కాంత జిల్లా, గంభోయ్ గ్రామంలో దారుణం జరిగింది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు జాలి, దయ, కరుణ లేకుండా ఓ పసిపాపను బతికుండగానే భూమిలో పాతిపెట్టి, పారిపోయారు. దాంతో అదే గ్రామానికి చెందిన రైతు గురువారం ఉదయం తన పొలానికి వెళ్లాడు. ఎవరో తన పొలంలో గుంత తవ్వినట్లు అనుమానం రావడంతో అక్కడి వెళ్లి చూడగా, ఒక చిన్నారి చేయి పైకి తేలి కనిపించింది. వెంటనే అధికారులకు విషయాన్ని తెలియజేశారు. ఘటన స్ధలానికి చేరుకున్న అధికారులు ఆ చిన్నారిని రక్షించారు.

”సంబర్కాంత జిల్లా, గంభోయ్ గ్రామంలో గతరాత్రి ఎవరో ఈ పసిపాపను భూమిలో పాతిపెట్టారు. ఈరోజు ఉదయం పొలానికి వచ్చిన రైతుకు అనుమానం రావడంతో పాపను రక్షించగల్గినం. చిన్నారి చేయిపైకి తేలి కనిపించడంతో రైతు పక్కనే పవర్ స్టేషన్‌లో పని చేస్తున్న వాళ్లను పిలిచాడు. వారి సహాయంతో అక్కడ జాగ్రత్తగా తవ్వి చూడగా, ఒక శిశువు కనిపించింది. అయితే, ఆ చిన్నారి ప్రాణాలతోనే ఉంది. వెంటనే విషయాన్ని మాకు తెలిపాడు” అని అధికారులు వివరాలను వెల్లడించారు.

అనంతరం పొలానికి చేరుకున్న అధికారులు అంబులెన్స్‌లో చిన్నారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఎవరు ఈ దారుణానికి పాల్పడ్డారు అనే విషయంపై స్థానికులు చర్చించుకోవటం మొదలుపెట్టారు.