People who robbed a store in America
mictv telugu

వీడియో : అమెరికాలో మాస్ లూటీ.. క్షణాల్లోనే మొత్తం..

August 20, 2022

People who robbed a store in America

అది అమెరికాలోని ప్రసిద్ధ లాస్ ఏంజిల్స్ నగరం. అక్కడ శాంతి భద్రతలు పక్కాగా ఉంటాయి. ఎక్కడ ఏ తేడా జరిగినా పోలీసులు క్షణాల్లో ప్రత్యక్షమవుతారు. అలాంటి నగరంలో వందలాది మంది ఒకేసారి ఓ మాల్‌లో ప్రవేశించి మాస్ దోపిడీకి పాల్పడ్డారు. మాల్‌లో ఒక్కరే ఉద్యోగి ఉండడంతో అతను ఏమీ చేయలేకపోగా, ప్రాణ భయంతో దాక్కున్నాడు. అగ్రరాజ్యమైన అమెరికాలో జరిగిన ఈ సంఘటన తాలూకు వీడియోను సోషల్ మీడియలో పెట్టడంతో అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని 7- 11 దుకాణాన్ని దోపిడీదారులు దోచుకున్నారు. డజన్ల కొద్దీ ప్రజలు దుకాణంలోకి చొరబడి పానీయాలు, స్నాక్స్, సిగరెట్లు, లోట్టో టిక్కెట్లు సహా ఏది చేతికందితే అది దొరకబుచ్చుకున్నారు. చాలా మంది కౌంటర్ మీదుగా వెళ్లి అక్కడి వస్తువులను తీసుకున్నారు. అల్మారాల్లో దాచుకున్న వస్తువులను కూడా వదిలిపెట్టలేదు. నగదు కౌంటర్లు కూడా ధ్వంసం చేశారు. అయితే ఎంత నగదు దోచుకెళ్లారో తెలియరాలేదు. అటు వీడియో స్పష్టంగా ఉన్నా కూడా దోపిడీ దారులను పట్టుకోవడానికి పోలీసులు నగర ప్రజల సహాయం కోరడం విచిత్రంగా అనిపిస్తోంది. కాగా, అమెరికాలో ఒక్కోసారి ఇలా ఫ్లాష్ మాబ్స్ జరుగుతుంటాయి. కొన్నిసార్లు ఇవి హింసాత్మకంగా కూడా మారతాయని పోలీసులు తెలిపారు.