జొమాటో బాయ్‌ని కులం అడిగి… ఉమ్మి, విసిరికొట్టి..
భారత సమాజంలో కులం ఎంత బలంగా వేళ్లూనుకుందో మరోసారి చాటిచెప్పే సంఘటన ఇది. చదువు, డబ్బు విషయంలో ముందంజలో ఉన్న దక్షిణాది భారతంతో పోలిస్తే ఉత్తరాదిలో కుల పట్టింపులు దారుణంగా ఉంటాయి. ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూ నగరంలో ఫుడ్ డెలివరీ ఇచ్చిన యువకుడిని కొందరు అగ్రవర్ణాల వారు కులం పేరుతో దూషించి, ముఖంపై ఉమ్మేశారు. బండి లాక్కుని దాడి చేశారు.
దీంతో పోలీసులను ఆశ్రయించిన సదరు యువకుడు వారి జోక్యంతో తన బండిని తిరిగి తెచ్చుకున్నాడు. నాలుగేళ్లుగా జొమాటోలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న వినీత్ కుమార్ మాటల్లో.. ‘శనివారం సాయంత్రం ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్లాను. ఆర్డర్ చేసిన వ్యక్తులు కులం, పేరు అడగడంతో చెప్పాను. దాంతో అంటరాని వాడు తెచ్చిన ఆహారం మేం తినమంటూ కులం పేరుతో దూషించారు. అవసరం లేకుంటే ఆర్డర్ క్యాన్సిల్ చేయమని కోరినా, వినిపించుకోకుండా నా ముఖంపై ఉమ్మారు. మరికొంత మందిని పిలిచి భౌతిక దాడికి పాల్పడ్డారు. నా బండిని కూడా లాక్కోవడంతో నేను పోలీసులకు ఫోన్ చేశాను. వారు వచ్చి నా బండిని తిరిగి ఇప్పించారు’ అని వెల్లడించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, ఆధారాల కోసం సీసీ కెమెరాల వీడియోలను పరిశీలిస్తున్నట్టు కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపారు.