ఆస్ట్రేలియాలో శనివారం వింత ఓటింగ్ జరిగింది. ఓటు వేసేందుకు కొంతమంది స్త్రీలు, పురుషులు అండర్వేర్లతో వచ్చి ఓటింగ్ వేసి అందరికి బిగ్ షాక్ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 2007 తర్వాత తొలిసారిగా జరిగిన ఆస్ట్రేలియా ఎన్నికల్లో విపక్ష లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. త్వరలోనే ఆ పార్టీ నేత ఆంటోనీ ఆల్బనీస్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. శనివారం 151 స్థానాలున్న సభకు సభ్యుల్ని ఎన్నుకునేందుకు ఓటింగ్ జరిగింది.
ఈ క్రమంలో ఓటు వేసేందుకు అనేక మంది స్త్రీలు, పురుషులు అండర్వేర్లతో పోలింగ్ కేంద్రాలకు వచ్చి, తమ ఓటు వేశారు. ఈ వింత ఓటింగ్‌కు కారణం.. #SmugglersDecide అనే హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ చేస్తే బ్రాండెడ్ స్విమ్వేర్ను ఉచితంగా ఇస్తామని ‘బడ్జీ స్మగ్లర్ సంస్థ’ ప్రకటించడమే. కంపెనీ ప్రకటించిన ఆఫర్ తెగ నచ్చడంతో పురుషులు అండర్‌వేర్‌తో రాగా, మహిళలు స్విమ్ సూట్ ధరించి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ‘మా ప్రకటనకు ఇంత పెద్ద ఎత్తున స్పందన వస్తుందని అసలు ఊహించలేదు. ఏదో ఒకరిద్దరు వస్తారని అనుకున్నాం. కానీ వందల మంది వచ్చారు. వారందరికీ సోమవారం నుంచి బహుమతులు ఇస్తాం’ అని బడ్జీ స్మగ్లర్ సంస్థ ప్రకటించింది.