వికలాంగులకు శుభవార్త.. జీఎస్టీ తగ్గింపు.. - MicTv.in - Telugu News
mictv telugu

వికలాంగులకు శుభవార్త.. జీఎస్టీ తగ్గింపు..

October 25, 2019

People with orthopaedic disability to pay lower 18% GST on some vehicles

కొత్త వాహనం కొనుక్కునే వికలాంగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. జీఎస్‌టీకి సంబంధించి నిబంధనలను సవరిస్తూ.. అంగవైకల్యం ఉన్నవారికి జీఎస్‌టీలో రాయితీ కల్పిస్తోంది. 40 శాతం లేదా ఆపైన అంగవైకల్యం ఉన్న వారికే ఇది వర్తిస్తుందని వెల్లడించింది.
భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ శుక్రవారం దీనికి సంబంధించిన నిబంధనలను తెలియజేసింది. 40 శాతం, ఆపైన అంగవైకల్యం ఉన్నవారు ఉపయోగించేందుకు కొనుగోలు చేసే వాహనాలకు 18 శాతం జీఎస్‌టీ వర్తిస్తుందని తెలిపింది. గతంలో ఇది 28 శాతంగా ఉండేది.

అలాగే పెట్రోలో, ఎల్‌పీజీ, సీఎన్‌జీ ఇంధనంతో నడిచే 4000 ఎంఎం పొడువు కన్నా లోపు ఉన్న వాహనాలకు మాత్రమే కొత్త జీఎస్‌టీ తగ్గింపు రూల్స్ వర్తిస్తాయని పేర్కొంది. ఇంజిన్ సామర్థ్యం 1,200 సీసీని మించకూడదు. అదే డీజిల్‌తో నడిచే వాహనాల ఇంజిన్ సామర్థ్యం 1,500 సీసీ లోపు ఉండాలి అని స్పష్టంచేసింది. జీఎస్‌టీ రాయితీతో వెహికల్ కొనుగోలు చేసేవారు కచ్చితంగా మెడికల్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. అలాగే గత మూడేళ్ల ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా అందజేయాల్సి ఉంటుంది.

అంతేకాకుండా గత ఐదేళ్లలో ఇలాంటి అందుబాటులో ఉన్న రాయితీని పొందలేదని సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఇవ్వాలి. ఆఫీసర్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ కన్సీషనల్ సర్టిఫికెట్‌ను జారీచేస్తారు. డిప్యూటీ సెక్రటరీ కన్నా తక్కువ ర్యాంక్ ఉన్నవారు ఈ సర్టిఫికెట్‌ను జారీ చేయరాదు. వీళ్లే సర్టిఫికెట్‌ను డీలర్లకు, ఆర్‌టీవో, తయారీ కంపెనీలకు సర్టిఫికెట్‌ను పంపిస్తారు.