షుగర్ ఉన్నవాళ్లు.. పుచ్చకాయ తినొచ్చా? - MicTv.in - Telugu News
mictv telugu

షుగర్ ఉన్నవాళ్లు.. పుచ్చకాయ తినొచ్చా?

May 12, 2022

భారత్‌లో గతకొన్ని నెలలుగా షుగర్ వ్యాధి బారినపడే వారి సంఖ్య క్రమ క్రమంగా పెరిగిపోతోందని వైద్యులు తెలిపారు. మానసిక ఒత్తిడి, ఉద్యోగంలో ఒత్తిడి, కుటుంబ సమస్యలతోపాటు రకరకాల కారణాల వల్ల సగటు మనిషి అనారోగ్యానికి గురౌతున్నాడని, ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవాలంటే అది మన చేతుల్లోనే ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా పట్టణల్లో, పల్లెల్లో ఎక్కువ మంది బీపీ, షుగరు బారిన పడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలో షుగర్ పేషంట్లు పుచ్చకాయ తినొచ్చా? అనే ప్రశ్నకు వైద్యులు ఇచ్చిన సలహాలు ఏమిటో తెలుసుకుందామా..

ఇంతకు ముందు పట్టణవాసులకే ఈ జబ్బు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు పల్లెల్లో ఉండే వారికి కూడా వ్యాపించింది. ప్రతి నలుగురిలో ఒకరికి బీపీ, 30 ఏళ్లు నిండిన ప్రతి ఐదుగురిలో ఒకరికి షుగర్ ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయవచ్చు. ఈ స్థాయిలో బీపీ, షుగర్ బాధితులుండటం అత్యంత ఆందోళన కలిగించే అంశం. అవగాహన లేక కొందరు, నిర్లక్ష్యంతో మరికొందరు ఈ రెండు ప్రమాదకర జబ్బులను నియంత్రణలో ఉంచుకోలేక పలు వ్యాధులకు చోటు ఇస్తున్నారు.

షుగర్ బారిన పడ్డవారు తియ్యగా ఉంటే ఏది తినకూడదని వైద్యుల సలహా. కానీ.. పుచ్చకాయ తీయ్యగా ఉండటం వల్ల దీన్ని తినొచ్చా? లేదా అని చాలా మందికి ఓ సందేహం ఉంటుంది. పుచ్చకాయ విషయంలో ఆ భయం అక్కర్లేదు. ఎందుకంటే ఆయా ఆహార పదార్థాల్లోని గ్లూకోజ్ రక్తంలో ఎంత వేగంగా కలుస్తుందనేదాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ)తో సూచిస్తారు. ఇది అధికంగా ఉండే పండ్ల విషయంలో డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పుచ్చకాయలో జీఐ 72 శాతం ఉంటుంది. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండి పిండి పదార్థం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి పుచ్చకాయ తిన్నప్పుడు వెంటనే గ్లూకోజ్ పెరిగినప్పటికీ వెంటనే తగ్గిపోతుంది. కాబట్టి నిరభ్యంతరంగా పుచ్చకాయను తినొచ్చు.