ఇది బూటకపు ప్రజాస్వామ్యం, దొంగల పార్లమెంటు, బతుకులు బాగుపడాలంటే ఎన్నికలను బహిష్కరించాలని గతంలో పెద్దగొంతుకతో పాటలు పాడి ప్రజాయుద్ధనౌక అని పేరు తెచ్చుకున్న గాయకుడు గద్దర్ ఓటు బాటపట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి ఆయన ఎప్పుడెప్పుడా రెడీగాా ఉన్నారు. దాంతోపాటు ఓటుహక్కు ప్రాధాన్యంపై ప్రచారం కూడా చేస్తున్నారు.
ప్రజలు కోరితే గజ్వేల్‌లో ఆపద్ధర్మ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై పోటీ చేస్తానని గద్దర్ విలేకర్లకు చెప్పారు. ఆయన సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ను సచివాలయంలో కలిశారు. ఓటు హక్కు వినియోగంపై ప్రజలను చైతన్యవంతం చేస్తాననని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాచైతన్య యాత్రకు అనుమతివ్వాలని, తెలంగాణలోని 31 జిల్లాల్లో మీట్ ద ప్రెస్ ద్వారా ఓటు హక్కు ప్రాధాన్యాన్ని వివరిస్తానని వెల్లడించారు. ‘ఓటు నమోదు చేసుకోవడం నా జీవితంలో గొప్ప మార్పు. ప్రజలు కోరుకుంటే గజ్వేల్ నుంచి పోటీ చేస్తాను. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేస్తే దేశంలో 25శాతం ప్రజాస్వామ్యం బతికి ఉంటుంది..’ అని అన్నారు. రాష్ట్రంలో చాలామంది ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధి కలగడం లేదని ఆరోపించారు.