ఆర్థిక మాంద్యం భయంతో కంపెనీలు అలెర్ట్ అయ్యాయి. ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగించే పనిలో పడ్డాయి. సాఫ్ట్ వేర్ రంగంలో దిగ్గజ కంపెనీలు ఇటీవల వరుసబెట్టి ఉద్యోగాల కోత విధించడం తెలిసిందే. పెద్ద సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించేశాయి.
ట్విట్టర్‌తో మొదలైన ఉద్యోగుల కోత అమెజాన్, ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా వంటి టెక్ సంస్థలకు పాకింది. ఇప్పటికే వేలాది మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. తాజాగా ప్రముఖ బేవరేజ్ కంపెనీ పెప్సికో వంతు వచ్చింది. వందలాది మంది ఉద్యోగులను వదిలించుకునేందుకు పెప్సికో సిద్ధమైంది. ఇప్పటికే ఉత్తర అమెరికాలోని వందలాది కార్పొరేట్ ఉద్యోగాలను తొలగిస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. పెప్సికోలలో ప్రపంచవ్యాప్తంగా 3,09,000 మంది ఉద్యోగులున్నారు. వీరిలో 40శాతానికి పైగా అమెరికాలోనే ఉన్నారు. ఉద్యోగ తొలగింపు వార్తలపై పెప్సికో యాజమాన్యం స్పందించాల్సి ఉంది.