ఓవరాక్షన్ చేసిన ఎస్ఐపై సస్పెన్షన్ వేటు - MicTv.in - Telugu News
mictv telugu

ఓవరాక్షన్ చేసిన ఎస్ఐపై సస్పెన్షన్ వేటు

March 27, 2020

Peravali SI Suspended for Lathi Charge

అధికారం ఇచ్చా రు కదా అని పోలీసులు కొమ్ములు ఎగరేస్తే వాటిని కత్తిరించే వారు ఉంటారని గుర్తుంచుకునేలా చేశారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. విధి నిర్వహణలో ఓవరాక్షన్ చేస్తూ చేతిలో ఉన్న లాఠీకి పని చెప్పిన ఎస్సైపై సస్పెన్షన్ వేటు వేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన యువకుడితో పాటు మహిళపై దాడి చేసినందుకు విధుల నుంచి తప్పించారు. విధులు నిర్వహించడం ఎంత అవసరమో, బాధ్యతగా వ్యవహరించడం కూడా అవసరమంటూ చురకలంటించారు. ఇంకోసారి ఇలా ఏ పోలీసు చేసినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా  పెరవలిలో ఓ ఎస్సై నిర్వాకంపై డీజీపీ ఈ విధంగా స్పందించాల్సి వచ్చింది. 

పెరవలికి చెందిన ఓ యువకుడు ఇటీవల విదేశాల నుంచి వచ్చాడు. అతన్ని ఇంట్లోనే క్వారైంటన్ ఉండాలని వైద్యాధికారులు సూచించారు. కానీ అవేవి పట్టించుకొని ఆ యువకుడు బయటకు వచ్చాడు. ఈ విషయం తెలిసిన ఎస్సై కిరణ్ కుమార్ తన సిబ్బందితో వచ్చి లాఠీ ఝులిపించాడు. ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ యువకుడి తండ్రిపై కూడా పోలీసు దాడి చేశాడు. పక్కనే ఓ మహిళ ఉండగా నిబంధనలకు విరుద్దంగా చేయి చేసుకున్నాడు. దీన్ని సమీపంలోని వారు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్ అయింది. విషయం తెలిసిన డీజీపీ అతనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎవరైనా మాట వినకపోతే ఐసోలేషన్ వార్డుకు తరలించాలి తప్ప దాడిచేయడం సరికాదని ఎస్సైపై ఆగ్రహం వ్యక్తం చేశారు.