పాక్‌లో హిందువులపై ఆగని ఆగడాలు.. ఇద్దరమ్మాయిలను కిడ్నాప్ చేసి.. - MicTv.in - Telugu News
mictv telugu

పాక్‌లో హిందువులపై ఆగని ఆగడాలు.. ఇద్దరమ్మాయిలను కిడ్నాప్ చేసి..

June 2, 2020

pak

పాకిస్తాన్‌లో మైనార్టీలపై అకృత్యాలు జరగడం నిత్యకృత్యమైంది. అక్కడ నిత్యం హిందూ యువతుల అపహరణ, మత మార్పిడి ఘటనలు పెరిగిపోతున్నాయి. ఒకే జిల్లాలో వేర్వేరు చోట్ల రెండు ఘటనలు సోమవారం చోటు చేసుకున్నాయి. దుండగులు అక్రమంగా బాధితుల ఇంట్లో చొరబడి వారిని లాక్కెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. సింధు ప్రావిన్స్‌లోని మీర్పూర్‌ ఖాస్‌ జిల్లా రాయీస్‌ నేహాల్‌ ఖాన్‌ గ్రామానికి చెందిన రాయ్‌ సింగ్‌ కోహ్లి తన కూతురు అపహరణకు గురైనట్లు వెల్లడించారు. 15 ఏళ్ల సుంటారాను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని.. దీంతో వెంటనే తాము స్థానిక పోలీస్‌ స్టేషనుకు వెళ్లి ఫిర్యాదు చేశామని తెలిపారు.  పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా, తమను వేధింపులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాగైనా తమ కూతురిని వెనక్కి తీసుకురావాలంటూ పోలీసులను వేడుకున్నారు. మరోవైపు అదే జిల్లాలోని హాజీ సయీద్‌ గ్రామంలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకోవడం కలకలం రేపింది. 

19 ఏళ్ల భగవంతి అనే వివాహితను కొంతమంది దుండగులు లాక్కెళ్లిపోయారు. ఇస్లాం మతం స్వీకరించాలంటూ ఆమెను బలవంతపెట్టారు. దీంతో భగవంతి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషనుకు వెళ్లి నిరసన తెలిపారు. అప్పటికే అక్కడికి చేరుకున్న సదరు వ్యక్తులు.. భగవంతి మతం మారినట్లుగా కొన్ని పత్రాలను పోలీసులకు సమర్పించారు. అది చూసి తమ కూతురి జీవితం నాశనమైందని ఆమె కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఇదిలావుండగా సింధు ప్రావిన్స్‌లోని థార్‌పర్కర్‌ జిల్లాలోని బార్మేలీలో నివసిస్తున్న హిందువులపై ఇదే రోజు మూక దాడి జరిగింది. పురుషులు, మహిళలు, చిన్న పిల్లలు అనే తేడా లేకుండా వారిపై దాడిచేసిన దుండగులు ఇళ్లను ధ్వంసం చేశారు. ఈ ఘటనలతో అక్కడి హిందువులు నిత్యం భయం గుప్పిటలో కాలం వెళ్లదీస్తున్నారు.