ఇటీవలి కాలంలో వయస్సు, ఆరోగ్యం అని తేడా లేకుండా చాలామంది ఆకస్మాత్తుగా గుండెపోటుకి గురయ్యారనే వార్తలు తరచూ వింటూ వస్తున్నాం. ముఖ్యంగా జిమ్ చేస్తూనో.. లేదంటే ఏదైనా గేమ్ ఆడుతూనో, డాన్స్ చేస్తూనో సడెన్‌గా కుప్పకూలడం సర్వసాధారణమై పోయింది. ఇటీవల హైదరాబాద్‌లో ఇలాంటి మరణాలు చాలా చోటుచేసుకోగా.. తాజాగా మంగళవారం సాయంత్రం లాలాపేట స్టేడియంలో గుండెపోటుతో ఒకరు మృతి చెందారు. బ్యాడ్మింటన్ ఆడుతూ పరమేష్ యాదవ్(38) అనే వ్యక్తి కుప్పకూలాడు. వెంటనే అక్కడున్న వారు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో మరణించినట్టు వైద్యుల ధృవీకరించారు.
శ్యామ్ యాదవ్ మృతదేహాన్ని మల్కాజిగిరిలోని అతడి ఇంటికి పోలీసులు తరలించారు. మృతుడు శ్యామ్ యాదవ్ ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రతిరోజూ డ్యూటీ అయిన తర్వాత స్టేడియంకు వచ్చి బ్యాడ్మింటన్ ఆడతాడని స్నేహితులు చెబుతున్నారు. శ్యామ్ యాదవ్ మృతితో అతడి కుటుంబసభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 38 ఏళ్ల వయస్సులోనే గుండెపోటుతో చనిపోవడం బాధాకరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఫిబ్రవరి 25వ తేదీన కర్నూలు జిల్లాలోని ఆదోనిలో ప్రభు అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జిమ్ చేస్తూ హార్ట్ స్ట్రోక్‌తో మరణించాడు. ఇక ఫిబ్రవరి 23న సికింద్రాబాద్‌కు చెందిన 30 ఏళ్లు విశాల్ అనే కానిస్టేబుల్ జిమ్ చేస్తుండగా అక్కడిక్కడే గుండెపోటుకు గురై సెకన్లలో మృతి చెందాడు. గత నెలలో నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో మిత్రుడు పెళ్లి రిసెప్షన్‌లో 19 ఏళ్ల యువకుడు డ్యాన్స్ వేస్తూ హార్ట్ అటాక్‌తో అక్కడికక్కడే మరణించాడు.