Peruvian delivery man carried ancient mummy around in his bag
mictv telugu

‘మమ్మీ’ ని బ్యాగులో పెట్టుకొని షికార్లు.. అడిగితే ‘లవర్’ అని కబుర్లు

March 2, 2023

Peruvian delivery man carried ancient mummy around in his bag

ఓ యువకుడి వింత ప్రవర్తనతో.. పోలీసులు షాకయ్యారు. దాదాపు 800 ఏళ్లనాటి మమ్మీని (శవాన్ని) ఇంట్లో ఉంచుకున్నాడు. దాన్ని ప్రాణంగా ప్రేమిస్తున్నానని, ఆరాధిస్తున్నానని చెప్తున్నాడు. ఈ వింత ఘటన పెరూలో చోటు చేసుకుంది. 26 ఏళ్ల జూలియో సీజర్ బెర్మెజో అనే యువకుడు.. గత ముప్పై ఏళ్లుగా ఆ మమ్మీ వాళ్లింట్లోనే ఉందని, దాన్ని ఒక ఐసోథర్మల్ బ్యాగ్‌లో పెట్టి కాపాడుతున్నట్లు చెప్పడం విని పోలీసులకు ఓ క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు.

పునో ప్రాంతానికి చెందిన సీజర్ బెర్మెజో కుటుంబం తరాలుగా ఫుడ్, సరుకుల రవాణా చేస్తుండేవాళ్లు. 30 ఏళ్ల క్రితం బెర్మెజో తండ్రి జువానిటా అనే మమ్మీని తనతో తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకున్నాడు. తన తండ్రి తర్వాత వారసత్వంగా బెర్మెజో ఆ మమ్మీని చూసుకుంటున్నాడు. గత కొన్ని రోజులుగా అతడు తన బ్యాగులో ఆ మమ్మీని పెట్టుకుని ఊరంతా తిరుగుతున్నాడు. గత శనివారం రాత్రి జూలియో తన స్నేహితులతో కలిసి రోడ్డు పక్కన ఉండగా.. పెట్రోలింగ్‌ పోలీసులు వచ్చారు. అప్పుడు అతడి వద్ద ఓ బ్యాగు అనుమానాస్పదంగా కన్పించింది. దాన్ని తెరిచి చూడగా పోలీసులు అవాక్కయ్యారు. అందులో ఓ మమ్మీ (Mummy)ని గుర్తించిన పోలీసులు.. వాటిని అక్రమంగా విక్రయిస్తున్నాడన్న అభియోగాలపై అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

అయితే విచారణలో పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఆ మమ్మీని తాను విక్రయానికి తీసుకురాలేదని, తన స్నేహితులకు చూపించేందుకు తెచ్చానని బెర్మెజో చెప్పాడు.. ‘‘ఇంట్లో అది నా రూంలోనే ఉంటుంది. నేను దాన్ని పక్కనే పెట్టుకుని నిద్రపోతా. జాగ్రత్తగా చూసుకుంటా. ఆధ్యాత్మికంగా ఆ మమ్మీ నా ప్రేయసి’’ అని చెప్పడంతో పోలీసులు షాకయ్యారు. ఇదంతా కాదని , ఆ మమ్మీని పురావస్తుశాఖ అధికారులకు అప్పగించగా.. 600 నుంచి 800ఏళ్ల క్రితం కాలానికి చెందినదిగా గుర్తించారు. అంతేకాదు.. బెర్మెజో అమ్మాయిగా భావిస్తున్న ఆ మమ్మీ గురించి అసలు నిజం చెప్పారు. ఏ మమ్మీని చూసి అతను ప్రేయసిగా భావిస్తున్నాడో.. అది వాస్తవానికి ఓ 45 ఏళ్ల పురుషుడిదని చెప్పి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఆ మమ్మీని ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్నదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.