PET anarchy.. Utbite did not wear two braids
mictv telugu

పీఈటీ అరాచకం..రెండు జడలు వేసుకోలేదని ఉట్‌బైట్‌

August 5, 2022

బాలికల పాఠశాలలో కాంట్రాక్ట్ పీఈటీగా విధులు నిర్వహిస్తున్న ఓ ఉపాధ్యాయురాలు..50 మంది విద్యార్థినులకు కఠినమైన శిక్ష విధించింది. విద్యార్థినిలు రెండు జడలు వేసుకోకుండా స్కూల్‌కు వచ్చారని, 120 నుంచి 200 వరకు గుంజీలు (ఉట్‌బైట్‌) తీయించింది. దాంతో పిల్లలు నడవలేని స్థితికి చేరుకొని, భరించలేని నొప్పులతో రొదిస్తున్నారు. అంతేకాదు, ఈ విషయం బయటికిరాకుండా స్కూల్ యాజమాన్యం నానా ప్రయత్నాలు చేసింది.

వివరాల్లోకి వెళ్తే..తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల పట్టణం కావేరమ్మపేటలో ఉన్న మైనార్టీ రెసిడెన్షియల్‌ బాలికల పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థినులు రెండు జడలు వేసుకోలేదని ఆగ్రహించిన పీఈటీ శ్వేత బుధవారం వారితో 120 నుంచి 200 వరకు గుంజీలు (ఉట్‌బైట్‌) తీయించింది. దీంతో కొంతమంది పిల్లలు నడవలేక తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. మరికొందరికి తీవ్రమైన జ్వరం వచ్చింది. కనీసం వైద్యాధికారులకు సమాచారం ఇవ్వకుండా తమకు తోచిన విధంగా ఉపశమన చర్యలు తీసుకుని, సిక్‌రూంలో తాళం వేసి బంధించారు. గురువారం మధ్యాహ్నం 20 మందికి జ్వరం తీవ్రం కావడంతో అర్బన్‌హెల్త్‌ సెంటర్‌కు తీసుకువెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు.

ఈ క్రమంలో కొంతమంది పిల్లలు తమ పరిస్థితిని వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి వివరించారు. ఆగ్రహంతో రగిలిపోయిన తల్లిదండ్రులు.. పాఠశాల వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. బుధవారం జరిగిన ఈ ఘటన తల్లిదండ్రుల ఆందోళనతో గురువారం బయటకు వచ్చింది.

అయితే, విషయం తెలుసుకున్న గురుకులాల ఆర్‌ఎల్‌సీ జమీర్‌ అహ్మద్‌ పాఠశాలకు చేరుకొని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కాంట్రాక్ట్‌ పద్ధతిపై విధులు నిర్వహిస్తున్న పీఈటీ శ్వేతను విధుల్లోంచి తొలగిస్తున్నట్లు ఆయన తెలిపారు.