పెంపుడు జంతువులు చాలా త్వరగా ఇంట్లో మనుషులతో కలసిపోతాయి. దినచర్యలో భాగంగా ఇంటి మనుషులు ఏ టైమ్‌కి నిద్ర లేస్తారు, తనకు ఆహారం ఏ వేళలో ఇస్తారనేది అన్ని ముందే తెలుసుకుంటాయి. ముఖ్యంగా పెంపుడు కుక్కులు అయితే ఈ విషయంలో మరీ విశ్వాసంగా ఉంటాయి. తన యాజమాని ఇంట్లోకి వచ్చిపోయే వేళలను సరిగ్గా అంచనా వేస్తాయి. అంతేకాదు కొత్త మనుషులు ఎవరైనా వస్తే.. సముదాయించేంత వరకూ కసితీరా అరుస్తాయి. ఇక ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే.. వారితోపాటు సరదాగా ఆడతాయి. పిల్లలైతే మరీనూ.. పెంపుడు కుక్కలతో ఆటపాటలతో గడుపుతారు. ఆ పసి మనుసులు.. మూగ జీవాల సైగలను చాలా బాగా అర్ధం చేసుకుంటాయి.
అలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ఇంట్లో.. ఒక చిన్న పాప.. పుస్తకాలు ముందేసుకొని.. చేతిలో రిమోట్ పట్టుకొని సీరియస్ గా టీవీ చూస్తోంది. అక్కడే పడుకున్న వారి పెంపుడు కుక్కకు బయటి నుంచి ఏదో చిన్నపాటి శబ్దం వచ్చింది. అంతే వెంటనే లేచి నిల్చుంది. చెవులు రిక్కించి విని.. ఆ వచ్చేది తన యజమాని అని గుర్తించింది. అంతే వెంటనే భౌ అని అరిచిన ఆ కుక్క..చదువుకోకుండా టీవీ చూస్తున్న పాపను అలెర్ట్ చేసింది. డాడీ వచ్చేస్తున్నారు..టీవీ కట్టేసి చదువుకో అంటూ సంకేతాలిచ్చింది.
Pawtners in crime..🐕🐾👧📺😅 pic.twitter.com/1eYFWvDeFY
— 𝕐o̴g̴ (@Yoda4ever) December 18, 2022
కుక్క సైగలతో విషయం అర్థం చేసుకున్న ఆ చిన్నారి.. వెంటనే రిమోట్‌తో టీవీని ఆపేసి.. సోఫా నుంచి లేచి.. కుర్చీలో కూర్చొని.. చదువుతున్నట్లు నటించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత పాప తండ్రి తలుపు తీశాడు. కుక్క ఏమీ ఎరగనట్లుగా అతని దగ్గరకు వెళ్లి తోక ఊపింది. ఇలా పాపతో చేతులుకలిపిన డాగ్.. ఈ నేరానికి పాల్పడింది. ఇదంతా అక్కడి సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియోని ట్విట్టర్‌లోని @Yoda4ever అకౌంట్లో డిసెంబర్ 18, 2022న పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని ఇప్పటివరకూ 10 లక్షల మందికిపైగా వీక్షించగా వేలాదిమంది లైక్ చేశారు.