Home > Featured > చిన్నారిని కరిచిన పెంపుడు కుక్క.. పట్టించుకోని యజమాని

చిన్నారిని కరిచిన పెంపుడు కుక్క.. పట్టించుకోని యజమాని

లిఫ్ట్‌లో వెళ్తుండగా ఓ బాలుడిని పెంపుడు కుక్క కరిచింది. ఆ సమయంలో ఆ కుక్క యజమాని కూడా అక్కడే ఉంది. ఆమె పక్కనుండగానే చిన్నారిని కరిచింది. బాధతో ఆ చిన్నారి అరుస్తుంటే ఆ మహిళ ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ షాకింగ్ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని ఓ రెసిడెన్షియల్ సొసైటీలో చోటు చేసుకుంది. బాలుడిని శునకం కరుస్తున్న దృశ్యాలు లిఫ్ట్‌లోని సీసీటీవీ కెమరాల్లో రికార్డు అయ్యాయి. సదరు వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.

ఆ చిన్నారి నొప్పితో అరుస్తున్నప్పటికీ ఆ మహిళ ఏ మాత్రం చలించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అతడిని పట్టించుకోకుండా వెళ్లిపోయింది. ఈనెల ఐదో తేదీ సాయంత్రం స్కూలు నుంచి తిరిగొచ్చిన ఓ బాలుడు ఘజియాబాద్‌లోని రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్ చార్మ్స్ కౌంటీ సొసైటీలో ఇంటికి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కాడు. అదే సమయంలో ఒక మహిళ, తన పెంపుడు కుక్కతో అదే లిఫ్ట్‌లోకి వచ్చింది. దీంతో బాలుడు కుక్కకు దూరంగా జరిగాడు. కానీ, కుక్క బాలుడి తొడపై కరిచింది. దీంతో బాధతో విలవిలలాడుతూ బాలుడు ఏడుస్తున్నా సరే ఆ మహిళ తనకేం పట్టనట్లుగా అలాగే ఉండిపోయింది. తర్వాత కుక్కను తీసుకుని వెళ్లిపోయింది.

దీనిపై బాలుడి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై చర్యలు తీసుకున్న పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తదుపరి విచారణ జరుగుతోంది. మహిళ నిర్లక్ష్యంపై నెటిజన్లు మండిపడుతున్నారు. తన కుక్క కరిచి బాలుడు విలవిల్లాడుతున్నప్పటికీ ఆమె కనీసం స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటన తర్వాత ఘజియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మహిళ ఇంటికి చేరుకుని పెంపుడు కుక్క వివరాలను నమోదు చేయలేదని గుర్తించారు. ఆమెకు రూ. 5 వేల జరిమానా విధించారు.

Updated : 7 Sep 2022 1:56 AM GMT
Tags:    
Next Story
Share it
Top