ఇకపై పెంపుడు కుక్కల యజమానులు.. వాటిని ఇష్టారీతిలో బయట తిప్పుతామంటే కుదరదు. రోడ్ల వెంట ఇష్టానుసారంగా తిప్పుతూ.. పరిసరాలను కాలుష్యం చేసినా, సిటిజన్లను కరిచినా తగు చర్యలు తీసుకోనుంది మధ్యప్రదేశ్ లోని సాగర్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది. ఎవరైనా కుక్కలను పెంచుకుంటే ట్యాక్స్ వేయనుంది. ఇందుకోసం మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సిటీలో పరిశుభ్రత, సిటిజనుల భద్రత, ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ బృందావన్ అహిర్వార్ చెప్పారు.
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.సాగర్ నగర వీధుల్లో కుక్కల బెడద పెరుగుతుండడంతో కుక్కల యజమానులపై పన్ను విధించాలని మున్సిపాలిటీ నిర్ణయం తీసుకుంది. వీధికుక్కల బెడద మాత్రమే కాకుండా పెంపుడు కుక్కల ద్వారా బహిరంగ ప్రదేశాలు మురుగుగా మారుతున్నాయి. వీధికుక్కలు, కుక్కలను పెంచే వారి వల్ల నగరమంతా చెత్తాచెదారం నిండుతుందని సాగర్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ చెప్పారు. కుక్కలు మనుషులను కరిచిన ఘటనలు అనేకం ఉన్నాయని కౌన్సిలర్లు సమావేశంలో ప్రస్తావించారు.