పెంచినబిడ్డ మూడేళ్ల తర్వాత వీధికుక్కలా.. గుండె చెమర్చేలా.. - MicTv.in - Telugu News
mictv telugu

పెంచినబిడ్డ మూడేళ్ల తర్వాత వీధికుక్కలా.. గుండె చెమర్చేలా..

October 11, 2018

తల్లీబిడ్డల అనుబంధం గురించి మాటల్లో చెప్పలేం. కొందరు పెంపుడు జంతువులను కూడా కన్నబిడ్డల్లా పెంచుకుంటారు. వాటికి ఏ చిన్నకష్టమొచ్చినా అల్లాడిపోతారు. పసిబిడ్డలా పెంచుకున్న కుక్క.. దారితప్పి ఏకంగా మూడేళ్లపాటు కనిపించకుండా పోతే ఎలా ఉంటుంది? గుండె పగిలిపోతుంది. ఆ మూగజీవి మూడేళ్ల తర్వాత వీధికుక్కలా కనిపిస్తే ఎలా ఉంటుంది? మనసు చివుక్కుమని కరిగి కన్నీరువుతుంది. అలాంటి దృశ్యమే ఇది. ఈ నెల 7న జార్జియా దేశ రాజధాని తిలిబిసిలో జరిగింది. చూసేవాళ్ల కళ్లను చెమరింపజేస్తోంది.

జార్జి బెరెజియానీ అనే వృద్ధుడి ఇంట్లో జోర్జి అనే కుక్క ఉండేంది. మూడేళ్ల కిందట ఏమైందో ఏమోగాని అని కనిపించకుండా పోయింది. జార్జి దాని కోసం ఊరంతా వెతికాడు. చుట్టుపక్కల ఊళ్లలో వాకబు చేశాడు. ఫలితం లేకపోయింది. జోర్జి ఈ లోకం నుంచి వెళ్లిపోయిందనుకున్నాడు. కానీ ఈ నెల 7న నగరంలోని ఓ ఒపెరా హౌస్ ఉద్యోగి నుంచి ఫోన్ వచ్చింది. అచ్చం జోర్జిలా ఉన్న కుక్క ఒకటి వీధికుక్కలా నానా అగచాట్లూ పడుతూ కనిపించిందని చెప్పారు. జార్జికి కాలు నిలవలేదు. వెంటన కారేసుకుని అక్కడికి వెళ్లాడు.

ఓ చెట్టుకింద ముడచుకుని పడుకున్న ఆ మూగజీవిని జోర్జీ అని పిలిచాడు. అది చెవులు రిక్కించి, వెంటనే తన యజమానిని అల్లుకుపోయింది. జార్జి ఆనందానికి అవధి లేకుండా పోయింది.  ‘నా బిడ్డా? ఇన్నాళ్లూ ఏమైపోయావురా నాయనా.. అయ్యో.. అయ్యో.. ’ అని జార్జి కన్నీళ్లు పెట్టుకున్నాడు. జోర్జి కూడా కుయ్ కుయ్ అంటూ భావోద్వేగానికి గురైంది. తర్వాత ఆ కుక్కను కారులో ఇంటికి తీసుకెళ్లాడు పెద్దాయన. అది అందర్నీ గుర్తుపడుతూ తెగ నాకేసింది. జోర్జి ఇంట్లోంచి వెళ్లిపోయాక దాన్ని మునిసిపాలిటీ వాళ్లు పట్టుకున్నారు. అదేమంత ప్రమాదకరమై కుక్క కాదని నిర్ధారించుకుని చెవికి ట్యాగేసి వీధుల్లో వదిలారు.