పెంపుడు కుక్కను కాల్చి చంపిన కిరాతకుడు - MicTv.in - Telugu News
mictv telugu

పెంపుడు కుక్కను కాల్చి చంపిన కిరాతకుడు

December 9, 2017

పెంపుడు కుక్కను కన్నబిడ్డల్లా చూసుకునే వారి గురించి మనకు తెలుసు. అసలు ఏ మూగజీవిని పెంచుకుంటున్నా దానిపై ప్రాణాలు పెట్టుకుంటాం. కానీ పంజాబ్‌లో ఒక మాజీసైనికుడు ఆ ప్రేమను చంపుకుని.. తన పెంపుడు కుక్కపిల్లను తాడు కట్టేసి, దారుణంగా కాల్చి చంపాడు.  

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.  బాద్బార్‌ గ్రామానికి చెందిన మాజీ సైనికుడు అజిత్‌ సింగ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఓ తోపుడు బండికి తన కుక్కను కట్టేశాడు. అది ప్రేమతో తోక వూపుతున్నా పట్టించుకోలేదు. తుపాకీ ఎందుకు వాడుతారో తెలియని ఆ ప్రాణి దాన్ని నోటితో పట్టుకోవడానికి యత్నించింది కూడా. కాని సింగ్ కనికరించలేదు. కుక్క తలకు గురి చూసి గుండు పేల్చాడు. దీంతో అది విలవిలా తన్నుకుంటూ ప్రాణాలు విడిచింది.  సింగ్ కొడుకు దీన్ని ఏదో ఘనకార్యం అన్నట్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతడు ఈ చంపుడును సమర్థించుకుంటున్నాడు. ఆ కుక్కకు రేబిస్ సోకిందని, రెండు బర్రెలను, స్థానికులను కరిచింది కాబట్టే చంపానని చెబుతున్నాడు. అయితే నిజమేమిటో పోస్టు మార్టంలో తేలనుంది.

ఈ అమానవీయ చర్యపై జంతు హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. సింగ్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి మేనకకు లేఖ రాశాయి. కుక్కకు ఒకవేళ రేబిస్ సోకి ఉంటే చికిత్స చేయించాలని, లేకపోతే దాన్ని వైద్యులు సూచించిన ప్రకారం విషపు ఇంజెక్షన్ వంటివేవో ఇచ్చి చనిపోయేలా చూడాలిగాని, ఇంత కర్కశంగా చంపడమేంటని ప్రశ్నిస్తున్నాయి. సింగ్ ఈ కుక్కను నిజంగానే ప్రేమతో పెంచుకుని ఉంటే.. దానికి ఇప్పటికే యాంటీ రేబిస్ వేసించి ఉండేవాడని, అతడు కేవలం పైశాచిక ఆనందం కోసమే కాల్చాడని అంటున్నాయి.