దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ ఘటన గురించి ఇంకా మరిచిపోనేలేదు. అలాంటి ఘటనలు వరుసగా నమోదు అవుతున్నాయి. ఈ దారుణ ఘటనల్లో ఎక్కువగా మహిళలే బలి అవుతున్నారు. తాజాగా నగరంలోని ఔటర్ రింగురోడ్డు వద్ద ఓ దారుణం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కోహెడకు వెళ్లే రోడ్డులో గుర్తు తెలియని ఒక మహిళ మృతదేహం తీవ్ర కలకలం రేపింది.
అత్యంత దారుణంగా శరీర భాగాలను, పాదాలను నరికి చెల్ల చెదురుగా వేసి ఆ మృతదేహానికి నిప్పు అంటించారు. మృతదేహంపై పెట్రోల్ పోసి తగులబెట్టడంతో డెడ్‌బాడీని గుర్తించడం కష్టంగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతురాలి వివరాలు కనుక్కున్నారు. ఆమె పేరు మైసమ్మ (60) అని తేల్చారు. మృతురాలు నగరంలోని వనస్థలిపురంలో నివాసం ఉంటోంది. ఈమె వంట చేయడానికి అని రెండు రోజుల క్రితం ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళింది. అప్పటి నుంచి కనిపించడంలేదని చెబుతూ వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేస్ నమోదు అయింది. ఆమె కాళ్ళకు ఉన్న వెండి కడియాలు కోసమే దుండగులు ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.