దసరాకు బీజేపీ, ఆరెస్సెస్ నేతలపై దాడులకు పీఎఫ్ఐ కుట్ర - MicTv.in - Telugu News
mictv telugu

దసరాకు బీజేపీ, ఆరెస్సెస్ నేతలపై దాడులకు పీఎఫ్ఐ కుట్ర

September 26, 2022

ఇస్లామిక్ అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా చేసిన కుట్రలు ఒక్కోటి వెలుగు చూస్తున్నాయి. బీహార్‌ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ హత్యకు కుట్రపన్ని విఫలమైనారని ఇంతకు ముందే వెల్లడైన విషయం తెలిసిందే. తాజాగా మహారాష్ట్ర ఏటీఎస్ విచారణలో మరో విషయం బయటపడింది. రానున్న దసరా పండుగ వేళ బీజేపీ, ఆరెస్సెస్ నేతలు టార్గెట్‌గా దాడులకు పాల్పడాలని కుట్ర చేసినట్టు అధికారులు వెల్లడించారు. నాగ్‌పూర్‌లోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం కూడా టార్గెట్ లిస్టులో ఉందని వారు తెలిపారు.

అగ్రనేతల కదలికలపై నిఘా వేసి దాడికి పాల్పడి దేశంలో మతకల్లోలాలు సృష్టించేందుకు ప్రయత్నించారని విచారణలో తేలింది. హిట్ లిస్టులో పలువురు దర్యాప్తు సంస్థల అధికారులు కూడా ఉన్నట్టు తేలిందని ఆయా వర్గాలు వివరించాయి. కాగా, దేశవ్యాప్తంగా వంద మంది పీఎఫ్ఐ సభ్యులను జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. వీరిలో అత్యధికంగా కేరళలో 22, మహారాష్ట్రలో 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. లష్కరేతోయిబా, ఐసిస్, ఆల్‌ఖైదా వంటి ఉగ్రసంస్థలతో వీరికి సంబంధాలున్నాయని, యువతను ఉగ్రవాదంలోకి చేరేలా ప్రోత్సహిస్తోందని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.