పీజీ చదవకున్న.. పీహెచ్‌డీలో చేరొచ్చు: యూజీసీ - MicTv.in - Telugu News
mictv telugu

పీజీ చదవకున్న.. పీహెచ్‌డీలో చేరొచ్చు: యూజీసీ

June 16, 2022

యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ విద్యార్థులకు ఓ కీలక విషయాన్ని తెలియజేసింది. ప్రస్తుతం ఇంటర్‌ తర్వాత డిగ్రీ, ఆ తర్వాత పీజీ, అనంతరం పీహెచ్‌.డీ ఇది ఇంతకాలంగా నడుస్తున్న కోర్సుల వరుస క్రమం. ఈ వరుసక్రమానికి త్వరలోనే చెక్ పెట్టి, పీజీ చదవకుండానే పీహెచ్‌డీలో చేరే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు యూజీసీ తెలిపింది.

”నాలుగేండ్ల డిగ్రీ తర్వాత పీజీ చదవకుండానే పీహెచ్‌డీలో చేరే అవకాశం కల్పిస్తున్నాం. ఈ ప్రవేశాల కోసం మినిమం స్టాండర్డ్స్‌ అండ్‌ ప్రొసీజర్‌ ఫర్‌ అవార్డ్‌ ఆఫ్‌ పీహెచ్‌డీ డిగ్రీ రెగ్యులేషన్స్‌-2022 పేరుతో యూజీసీ కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేసింది. ఈ మార్గదర్శకాలు త్వరలోనే విడుదల చేస్తాం. 2022 -23 విద్యాసంవత్సరంలోనే ఈ ప్రవేశాలు ఉంటాయి” అని యూజీసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ మామిడాల జగదీశ్‌ కుమార్‌ అన్నారు.

మరి పీజీ చదవకుండానే పీహెచ్‌డీలోకి ఎలా అనుమతిస్తారు? అనే విషయంలోకి వెళ్తే..’నూతన జాతీయ విద్యా విధానంలో నాలుగేండ్లల్లో 8 సెమిస్టర్స్‌లతో బ్యాచిలర్‌ డిగ్రీని అందజేస్తున్నారు. ఈ డిగ్రీలో 10 సీజీపీఏకు 7.5 సీజీపీఏ సాధించిన వారికి నేరుగా పీహెచ్‌డీ సీట్లు కేటాయిస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వికలాంగులకు 0.5 సీజీపీఏ మినహాయింపు ఉంటుంది. 7.5 సీజీపీఏ కంటే తక్కువగా పొందిన వారు ఏడాది వ్యవధి గల మాస్టర్స్‌ డిగ్రీని పూర్తిచేసే సరిపోతుంది. 40 శాతం సీట్లను యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశపరీక్ష ఆధారంగా భర్తీ చేయనుండగా, 60 శాతం సీట్లను నేషనల్‌ లెవల్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ద్వారా భర్తీచేస్తారు. నేషనల్‌ లెవల్‌ సీట్ల భర్తీలో భాగంగా యూజీసీ నెట్‌, సీఎస్‌ఐఆర్‌, ఐసీఎంఆర్‌, ఐసీఏఆర్‌ తదితర పరీక్షల్లో సాధించిన ప్రతిభ ద్వారా భర్తీ చేస్తారు.’