Phalana Abbayi Phalana Ammayi PAPA Tollywood Movie Review In Telugu
mictv telugu

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి.. Pha Pha మూవీ రివ్యూ

March 17, 2023

Phalana Abbayi Phalana Ammayi PAPA Tollywood Movie Review In Telugu

శ్రీనివాస్ అవసరాల డైలాగులకి, డైరెక్షన్కి ప్రత్యేకంగా కొందరు అభిమానులున్న విషయం తెలిసిందే. ఊహలు గుసగుసలాడే, జో అచ్యుతానంద లాంటి చిత్రాల తర్వాత ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి పేరు(PAPA)తో మళ్లీ నాగశౌర్యనే హీరోగా శ్రీనివాస్ అవసరాల డైరెక్ట్ చేసిన మూవీ కావడం, ట్రైలర్ కూడా కాస్త ఫ్రెష్ ఫీల్ కలిగించడంతో క్లాస్ ఆడియెన్సుకి కాస్త హైప్ క్రియేటయింది. మరా అంచనాలను మూవీ అందుకుందా? ఓ సరికొత్త ప్రేమకథని చూసిన ఫీల్ ప్రేక్షకులకి కలిగిందా?

కథ విషయానికొస్తే..

ఇంజనీరింగ్ కాలేజీలో సీనియరైన అనుపమ(మాళవిక)కి జూనియరైన సంజయ్ (నాగశౌర్య)కి ర్యాగింగ్ వల్ల పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత వయసు పెరుగుతన్న కొద్దీ ఒక్కొక్క దశలో పదేళ్ల గ్యాప్లో వీళ్ల స్నేహం, ప్రేమ, లివిన్, రిలేషన్ ఎలా ముందుకెళ్లింది? ఎలాంటి మలుపులు తిరిగింది? మధ్యలో గిరి (శ్రీనివాస్ అవసరాల) రాకతో వీళ్లిద్దరి రిలేషన్లో వచ్చే ఒడిదుడుకులు ఏంటి అనేదే అసలు కథ.

కథనం ఎలా ఉందంటే..

సినిమా అంతా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో మొత్తం ఏడు ఛాప్టర్లుగా సా..గుతుంది. అయిదు పదినిమిషాలకోసారి హీరో హీరోయిన్ రిలేషన్లోని ఒక్కో దశని చూయిస్తూ ఉండడంతో, అసలు ఏ ఫేజ్ని పూర్తిగా చూసిన ఫీల్ కలగదు. పైగా పదేళ్లలోని ఒక్కో దశని చూయిస్తుండడంతో కొన్నిసార్లు ఇయర్స్ పరంగా ఆడియెన్ కన్ఫ్యూజయే స్కోప్ లేకపోలేదు. పైగా సినిమా ప్రారంభం నుంచి చివరి వరకూ స్లో నేరేషన్తో సాగడం, ఎక్కడా హై మూమెంట్స్ లేకపోవడంతో ల్యాగ్ ఫీల్ కలుగుతుంది. బలమైన కాన్ ఫ్లిక్ట్ లేకపోవడం, ఉద్వేగాలక కనెక్టయే రేంజులో సీన్సేమీ లేకపోవడంతో కథనం చాలా పేలవంగా అనిపిస్తుంది. శ్రీనివాస్ అవసరాల మార్క్ డైలాగులు మచ్చుకైనా కూడా కనిపించవు. అటు డైలాగ్స్, డైరెక్షన్ పరంగా శ్రీనివాస్ అవసరాల మ్యాజిక్ ఎక్కడా ఫీలవరు ఆడియెన్స్. 2018లో షూట్ స్టార్ట్ చేసుకున్న ఈ మూవీ కరోనా, లాక్‌డౌన్ కారణంగా ఇప్పటికి రిలీజయివడంతో, మేకింగ్ ప్రాసెస్‌లోనే కాదు.. అవుట్ పుట్ పరంగా కూడా విపరీతమైన ల్యాగ్ అనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే..

ఒక్కో ఏజులో ఒక్కోలా కనిపించడానికి నాగశౌర్య మేకోవర్‌తో బాగానే మ్యానేజ్ చేశాడు. కానీ పర్ఫామెన్స్ పరంగా పెద్దగా చేయడానికేమీ లేదు సినిమాలో. హీరోయిన్‌గా మాళవిక నాయర్ కూడా అనుపమ పాత్రలో ఒదిగిపోయినా సినిమా అయిపోయాక గుర్తుండేంతలా అయితే ఆమె క్యారెక్టర్ ఉండదు. బ్రహ్మాస్త్ర, అవతార్ టూ డబ్బింగ్ డైలాగుల మీద పెట్టిన ఫోకస్ ఈ సినిమా డైలాగుల మీద పెట్టలేకపోయాడు శ్రీనివాస్ అవసరాల. యాక్టింగ్ పరంగా కూడా ఈ సినిమాలో తనకంత స్క్రీన్ స్పేస్ ఉన్న పాత్రకూడా కాకపోవడంతో ఆ రకంగా కూడా ఆడియెన్సుని అలరించలేకపోయాడు. శ్రీనివాస్ అవసరాల డైరెక్ట్ చేసే అన్ని సినిమాలకి కళ్యాణి మాలికే మ్యూజిక్ అందించినా ఈ సినిమాకి మాత్రం ఆయన మ్యూజికల్ మ్యాజిక్ అస్సలు కనిపించలేదు. పాటల పరంగా కనుల చాటుమేఘమా ఒకటే కాస్త పర్వాలేదనిపించినా మిగతా పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏవీ సినిమాను నిలబెట్టలేకపోయాయి. కథంతా యూకే బ్యాక్ డ్రాప్‌లో రాసుకోవడంతో అక్కడి లొకేషన్లనో తీయడానికి బానే కష్టపడ్డా, కథనంలో మాత్రం ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ లేకపోవడంతో సినిమా తేలిపోయింది. సినిమా చివర్లో నాగశౌర్య తల్లి ఫోటో కనిపించే సీన్లో, ఆఫోటో డౌన్ లోడ్ చేసిన వెబ్ సైట్ పేరు కూడా ఫోటోపై కనిపిస్తుంది. మరి ఆలస్యం అయ్యి అయ్యీ, వాయిదాలు పడీ పడీ డైరెక్షన్ టీమ్‌కి కూడా ఓపిక తగ్గిందేమో. అలాంటి చిన్నచిన్న విషయాలు కూడా పట్టించుకోకుండానే ప్రేక్షకుల మీదికి విసిరేశారు.

ఓవరాల్‌గా ఎలా ఉందంటే..

శ్రీనివాస్ అవసరాల సినిమా అని ప్రత్యేకంగా థియేటర్ కెళ్లే ఫలానా ఆడియెన్సుకి కూడా ఫలానా ఎలిమెంట్ అయినా పర్వాలేదనిపించేలా లేకపోవడంతో టాకీస్ వరకూ వెళ్లే అవసరముందా అని ఆలోచించాల్సిన పరిస్థితి.