పెళ్లి కష్టాలు.. వరదలను కూడా లెక్కచేయని జంట - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లి కష్టాలు.. వరదలను కూడా లెక్కచేయని జంట

October 28, 2020

Philippines Bride in Flood Water

కల్యాణం వచ్చినా.. కక్కు వచ్చినా ఆగదంటారు పెద్దలు. ఈ ఏడాది కరోనా, వరదలు ఎన్ని వచ్చినా కూడా అలాగే జరుగుతోంది. ఎలాగోలా జంటలు ఏకం అవుతూనే ఉన్నాయి. ఇటీవల పిలిప్పీన్స్‌లో కూడా ఓ జంట ఇలాగే చేసింది. భారీ వరదలను కూడా లెక్కచేయకుండా వివాహ వేడుక జరుపుకున్నారు. వాగులు, వంకలు దాటుకొని చర్చికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆ యువజంట పెళ్లి కోసం పడిన కష్టంపై పలువురు స్పందిస్తున్నారు. 

ఇటీవల టైఫూన్ క్వింటా కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. నదులు, వాగులు పొంగిపొర్లాయి. అదే సమయంలో ఈ నెల 23న రోనీ గుళీపా, జెజిల్ మసూలా పెళ్లి చేసుకోవాల్సి ఉంది. అప్పటికే వరదలు ముంచెత్తడంతో చర్చికి వెళ్లే మార్గంలో లుయాంగ్ నది పోటెత్తింది. ఎలాగైనా వివాహం చేసుకోవాలని ఆ యువ జంట పెళ్లి దుస్తుల్లోనే కష్టపడి నదిని దాటుకుని వెళ్లారు. వారి వెంట స్నేహితులు, బంధువులు కూడా వచ్చారు. ఎలాగోలా కార్యక్రమం ముగియడంతో అంతా సంతోషంలో మునిగిపోయారు. అయితే అంతకు ముందు పెళ్లి దుస్తుల్లో వధూవరులు పడిని ఇబ్బందులకు సంబంధించిన ఫోటోలు తాజాగా బయటకు వచ్చాయి.