Photo of Shinde's son on CM's chair goes viral; Oppn slams Maha govt
mictv telugu

మహారాష్ట్ర సీఎం పీఠంపై శిందే కొడుకు.. తీవ్ర విమర్శలు

September 23, 2022

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందేపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఆయన కుమారుడు శ్రీకాంత్ శిందే ముఖ్యమంత్రి సీట్లో కూర్చొన్న ఓ ఫోటో వైరల్ కావడం రాజకీయ దుమారం రేపింది. దీంతో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఎన్‌సీపీ శిందే సర్కార్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఈ ఫొటోలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీలో ఏక్‌నాథ్ శిందే కుమారుడు శ్రీకాంత్‌ శిందే కూర్చుని ఉన్నారు. ఆయన చుట్టూ అధికారులు ఉండగా.. ఆయనేవో దస్త్రాలు పరిశీలిస్తున్నట్లు అందులో ఉంది. మహారాష్ట్రలోని ఎన్సీపీకి చెందిన రవికాంత్‌ వార్పే ఈ ఫొటోను షేర్‌ చేశారు.

ముఖ్యమంత్రి అందుబాటులో లేనప్పుడు ఆయన కుమారుడు ఇలా ముఖ్యమంత్రి బాధ్యతలు చూస్తున్నారంటూ కాంగ్రెస్, ఎన్‌సీపీ నేతలు ఈ ఫోటోను వైరల్ చేస్తున్నారు. ఇది ముఖ్యమంత్రి అధికారిక నివాసం. ఆయన వెనుక మహారాష్ట్ర ముఖ్యమంత్రి అని రాసి ఉంది. అధికారిక సమావేశాలు లేదా అనధికారిక సమావేశాలకు హాజరు కావాలంటే ముఖ్యమంత్రి కుర్చీ పక్కనే కూర్చోవాలి. కానీ ఇక్కడ ఏకంగా సీట్లోనే కూర్చున్నారని, శ్రీకాంత్ శిందే సూపర్ సీఎం అంటూ రవికాంత్ ఎద్దేవా చేశారు.. ఇది మహారాష్ట్రలోని 13 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవ పీఠానికి సంబంధించిన విషయంగా పేర్కొన్నారు. భారీ ట్విస్టులు, నాటకీయ పరిణామాల మధ్య ఏక్నాథ్ శిందే ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్న సంగతి తెలిసిందే.