ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత అక్కడ పరిస్థితులు ఎలా మారాయో పైనున్న ఫోటోనే నిదర్శనం. తాజాగా తాలిబన్ పాలనలో ఓ ఆఫ్ఘన్ జర్నలిస్టు పరిస్థితి తలకిందులైన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. మూసా మొహమ్మదీ అనే ఆ వ్యక్తికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. ప్రజా ప్రభుత్వం ఉన్న సమయంలో మొహమ్మదీ టాప్ న్యూస్ యాంకర్, జర్నలిస్టుగా ఉండేవాడు. అనేక ఛానెళ్లలో యాంకర్, రిపోర్టర్ గా చాలా ఏళ్లు పనిచేశాడు. ఇప్పుడు అతని కుటుంబాన్ని పోషించుకోవడానికి రోడ్లపై సమోసాలు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్నాడు.
అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ప్రభుత్వంలో పనిచేసిన కబీర్ హక్మల్ ఇటీవల ట్విట్టర్లో ఈ పోస్ట్ పెట్టాడు. ఇప్పటి తాలిబన్ల అరాచక, అసమర్థ పాలనను ఈ ఫోటో తెలియజేస్తోంది. ఒక జర్నలిస్ట్ ఇంతటి దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నాడంటే, ఆ దేశంలోని మిగతా సాధారణ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందో ఈ ఘటన అద్ధం పడుతోందని ట్వీట్ చేశాడు . ఈ విషయం నేషనల్ రేడియో, టెలివిజన్ డైరెక్టర్ జనరల్ అహ్మదుల్లా వాసిక్ దృష్టికి వచ్చింది. దీంతో స్పందించిన ఆయన.. మాజీ టీవీ జర్నలిస్టుకు తన డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం కల్పిస్తామని పేర్కొన్నాడు.
తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత దేశంలో ఆర్థిక, మనవతా సంక్షోభం ఏర్పడింది. చాలా మంది ప్రజలు పేదరికంలోకి నెట్టివేయబడ్డారు. ఏకంగా పిల్లలను అమ్ముకోవడంతో పాటు వాళ్ల అవయవాలను కూడా అమ్ముకుని బతుకుబండిని నెట్టుకొస్తున్నారు. ముఖ్యంగా అనేక మంది జర్నలిస్టులు, మహిళా ఉద్యోగులు వాళ్ల ఉద్యోగాలను కోల్పోయారు.