‘గుప్పెడంత మనసు’ సీరియల్ కథ కాదు ఇది. ప్రపంచంలోనే అతి పెద్ద గుండె కథ. చూస్తేనే కాదు, మేటర్ తెలిస్తే వామ్మో వాయ్యో అని గుండెలపై చెయ్యేసుకునే వండర్. ఈ గుండె బరువు ఏకంగా 181 కేజీలు. ఇది లబ్ డబ్ అని కొట్టుకుంటే ఏకంగా3.2 కిలోమీటర్ల దూరం వినిస్తుంది. మరి దగ్గర్లో ఉండి వింటే చెవులు ఢమాలే కదా. ఇలాంటి విశేషాలెల్లో ఉన్న ఈ హృదయం ఫొటోలు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి. సరే, ఇంతకూ ఈ గుండె ఎవరిది? అనుకుంటున్నారు కదూ.
ఏనుగుదో, డైనోసార్‌దో అని ఆలోచిస్తున్నారు కదూ. దగ్గరిగానే వచ్చారు. ఇది అలాంటి పెద్ద జంతువుదైన, ప్రస్తుతం భూమ్మీద అతిపెద్ద జంతువుదైన తిమింగలం గుండెకాయ.
తిమింగలం బరువు 200 టన్నులపైనే ఉంటుంది కనుక ఈ గుండె కూడా దాదాపు 2 టన్నులు తూగింది. దీని వెడల్పు 1.2 మీటర్లు, ఎత్తు 1.5 మీటర్లు. బ్లూవేల్ జాతి తిమింగలానికి చెందిన ఈ గుండెను కెనడాలోని రాయల్ ఓంటారియో మ్యూజియంలో భద్రపరిచారు. ఆర్పీజీ గ్రూప్ చైర్మెన్ హర్ష్ గోయెంకా దీని ఫొటోను షేర్ చేసి వివరాలు వెల్లడించారు.
బ్లూ వేల్ తిమింగలాలను భారీసంఖ్యలో వేటాడుతుండడంతో వాటి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. నీలి తిమింగలం ఆకారం బరువు మాదిరే దాని అవయవాలు కూడా చాలా ప్రత్యేకం. నాలుక బరువు ఒక ఏనుగంత ఉంటుంది. ఇక పుర్రె ఏకంగా 5.8 మీటర్ల పొడవు ఉంటుంది. 1926లో వీటి సంఖ్య 1.25 లక్షలు కాగా ప్రస్తుతం 3000 లోపే ఉందని, వేట ఇలాగే కొనసాగితే ఇవి కూడా డైనోసార్లలాగా అంతరించిపోతాయని ప్రపంచ వన్యప్రాణి సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.