pig business fraud case: Punjab man cheated Rs.500 crores in the name of business
mictv telugu

‘పంది పిల్లల వ్యాపారం.. పెట్టుబడి పెడితే రూ.40 వేలు మీకే!’

November 21, 2022

ఏడు నెలల పాటు పంది పిల్లలని పెంచితే రూ.40 వేలు మీ సొంతం అంటూ అమాయకులను మోసం చేశాడో కేటుగాడు. పంది పిల్లల వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి.. ఏడు నెలల్లో 1.5 రెట్ల డబ్బును పొందండి.. అంటూ వల విసిరి రూ.వందల కోట్లకు ఓ వ్యక్తి కుచ్చుటోపీ పెట్టాడు. ఈ వ్యవహారంపై వివిధ రాష్ట్రాల్లో గత మూడేళ్లుగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్‌కు చెందిన మంగత్‌ రాం మైనీ అనే వ్యక్తి అధిక రాబడుల పేరుతో భారీ మొత్తాలు వసూలు చేసి మోసగించాడు. రూ. 10,000 విలువైన 3 పంది పిల్లలను కొనుగోలు చేసి పెంచితే.. విదేశాల్లో వాటి మాంసానికి ఉన్న గిరాకీతో ఏడు నెలల్లోనే రూ.40,000 వస్తాయంటూ నమ్మబలికాడు.

ఏడు నెలలు కాగానే రూ.15,000 ఇస్తానని, మిగిలిన రూ.25,000 వారానికి రూ.500 చొప్పున 30 వారాలపాటు చెల్లిస్తానని ప్రచారం చేసుకున్నాడు. దీనికి ఆకర్షితులై పలువురు రూ.10,000 నుంచి రూ.2 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారు. రక్షణరంగ ఉద్యోగి ఒకరు రూ.25 లక్షలు సమర్పించేశారు. ఇలా దాదాపు రూ.500 కోట్లు వసూలు చేసి, కొన్ని వారాలపాటు బాగానే చెల్లించిన మైనీ.. తర్వాత బోర్డు తిరగేశాడని బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ మోసంపై దిల్లీతోపాటు పంజాబ్‌, రాజస్థాన్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ కేసులు  నమోదయ్యాయి.