సంక్రాంతి స్పెషల్.. ఆ ఊళ్లో  పందుల పోటీ - MicTv.in - Telugu News
mictv telugu

సంక్రాంతి స్పెషల్.. ఆ ఊళ్లో  పందుల పోటీ

January 17, 2020

Pig competition.

సంక్రాంతి పండుగను వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుచుకుంటారు. ఈ పండుగ సందర్భంగా వినోదం కోసం వివిధ పోటీలను నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కోడి పందాలు, ఎడ్ల పందాలు, గొర్రె పందాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఏపీలోని గోదావరి జిల్లాల్లో ఈ పోటీలు ఎక్కువగా జరుగుతుంటాయి. తమిళనాడులో జల్లికట్టు నిర్వహిస్తారు. అస్సాం రాష్ట్రంలో దున్నపోతుల పోటీలు నిర్వహిస్తారు. 

అయితే పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లిలోని ఓ సామాజిక వర్గం ప్రజలు మాత్రం సంక్రాంతి పండుగ రోజు పందుల పోటీలు నిర్వహించి, తమ ప్రత్యేకతను చాటుకుంటారు. తాజాగా ఎస్టీ సంక్షేమ సంఘం నాయకులు సింగం పట్టాభి, సుబ్బారావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ పోటీలు బుధవారం జరిగాయి. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని వీరు క్రమం తప్పకుండా ఆచరించి సంప్రదాయానికి పెద్ద పీట వేస్తున్నారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పోటీదారులు తమ పందులతో హాజరు కావడం విశేషం. ఎటువంటి జీవహింస లేకుండా ఆరోగ్యకరమైన విధానంలో ఈ పోటీ జరుగుతుందని, తోకముడిచి పారిపోయిన పంది ఓడిపోయినట్టు భావించి మిగిలిన దాన్ని విజేతగా ప్రకటిస్తామని సింగం సుబ్బారావు తెలిపారు. ఈ పోటీలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తుంటారు.