విమానం ఎక్కిన పావురం..కంగారుపడిన ప్రయాణికులు - MicTv.in - Telugu News
mictv telugu

విమానం ఎక్కిన పావురం..కంగారుపడిన ప్రయాణికులు

February 29, 2020

,cmng

ప్రయాణికులు అంతా విమానం ఎక్కేసారు. ఇక మరికొద్ది క్షణాల్లో విమానం టేకాఫ్ తీసుకోబోతోంది అనగా ఓ పావురం కలకలం రేపింది. ఎలా వచ్చిందో తెలియదు కానీ ఉన్నట్టుండి లోపలికి దూరి హంగామా సృష్టించింది. దాన్ని చూసిన ప్రయాణికులు హడలిపోయారు. ఏం జరుగుతుందోనని ఆందోళన చెందారు. ఎయిర్ పోర్టు సిబ్బంది చాకచక్యంతో దాన్ని బయటకు పంపించి తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో ఈ ఘటన జరిగింది. 

గో ఎయిర్‌కు చెందిన జీ8702 విమానం అహ్మదాబాద్ నుండి జైపూర్కు వెళ్ళేందుకు సిద్ధమైంది. ఆ సమయంలో పావురం ప్రత్యక్షమైంది. ప్లైట్ అంతా అటూ ఇటూ తిరుగుతూ హంగామా సృష్టించింది. దాన్ని పట్టుకుని విమానం నుంచి బయటకు నెట్టడానికి సిబ్బంది చాలా కష్టపడ్డారు. చివరకు ఫ్లైట్ తలుపులు తెరిచిపెట్టడంతో అటూ ఇటూ తిరిగి దాని గుండా బయటకు వెళ్లిపోయింది.ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పావురం అటూ ఇటూ ఎగురుతూ ఉంటే కొందరు ప్రయాణికులు సెల్ ఫోన్లలో వీడియోలు తీస్తూ ఎంజాయ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత పావురాన్ని గుర్తించి ఉంటే ఎలాంటి ప్రమాదం జరిగేదో అని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగానే అది బయటకు రావడం ప్రమాదాన్ని తప్పించిందన్నారు. కాగా చాలా కాలంగా అహ్మదాబాద్ విమానాశ్రయంలో పక్షులు రావడం ఎక్కువైంది. దీని కారణంగా పలు విమానాలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందిగా మారిందనే వాదనలు కూడా ఉన్నాయి.