కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షడు, ఆ పార్టీ కేరళ ఎంపీ రాహుల్ గాంధీపై కేరళ కాంగ్రెస్ సీనియర్ నేత పీజే కురియన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక మీడియా పత్రికతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ సామర్ధ్యంపై పలు వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటల్లోనే.. ‘ పార్టీ అధ్యక్షపదవికి రాజీనామా చేయడం అనేది ఆయనలోని నిలకడలేమిని సూచిస్తుంది. పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు నాయకుడిగా ముందుండి పోరాడాలి. ఓడ మునిగిపోతుంటే కెప్టెన్ వదిలేసినట్టుగా ఉండకూడదు. పార్టీ దుస్థితిపై సీనియర్ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించాలి. గ్రౌండ్ లెవెల్లోని సమాచారం తెలుసుకోవాలి. ఇది వదిలేసి అనుభంం లేని కోటరీ మాటలను ఆయన ఎక్కువ పట్టించుకుంటారు. రాహుల్ అధ్యక్ష బాధ్యతలను వదిలేసిన తర్వాత ఆ పదవి ఖాళీగా ఉంది. అయినా నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుంటున్నారు. ఏ హోదాలో ఆయన ఈ పని చేస్తున్నారు? అధ్యక్ష పదవి వదులుకున్న తర్వాత పదవికున్న అధికారాలను కూడా వదులుకోవాలి. సారధి బాధ్యతలను ఇంకొకరికి అప్పగించడానికి అనుమతినివ్వరు. ఇది సమంజసం కాదు. రాహుల్ గాంధీ సంస్థాగత ఎన్నికల ద్వారా మరోసారి అధ్యక్షుడైతే మాలాంటి వాళ్లకు ఎలాంటి అభ్యంతరం ఉండదు’ అని వ్యాఖ్యానించారు. కాగా, రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందడం తెలిసిందే.