శ్రీనివాస్ గౌడ్ కుట్ర వెనక పీకే హస్తం: డీకే అరుణ - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీనివాస్ గౌడ్ కుట్ర వెనక పీకే హస్తం: డీకే అరుణ

March 3, 2022

తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నిన విషయం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 8 మందిని అరెస్టు చేశామని..సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ విషయంపై గురువారం బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఘాటుగా స్పందించారు. “మంత్రిని చంపాల్సిన అవసరం ఎవరికీ లేదు. హత్యకు కుట్ర పన్నారంటూ, యువకులపై తప్పుడు కేసులు పెట్టారు. ఈ కేసు వెనుక రాజకీయ, ప్రభుత్వ కుట్ర దాగి ఉంది. కొంతమంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇది ఇక బోగస్ కుట్ర” అని ఆమె మండిపడ్డారు.

అంతేకాకుండా ఈ హత్య కుట్ర వెనుక ప్రశాంత్ కిశోర్ కుట్ర ఉందని ఆరోపించారు. రాత్రిపూట ఇంటిపై రాళ్లు వేయడం కాదు. దమ్ముంటే తనపై రాజకీయంగా పోరాడాలని సవాల్ చేశారు. గత ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఈసీకి ఫిర్యాదు చేయడంతోపాటు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ అవినీతి, కబ్బాలపై బాధితులు గత కొన్నిరోజులుగా ప్రశ్నిస్తున్నారు అని డీకే అరుణ అన్నారు. కేసీఆర్ గారు మీక్కూడా పిల్లలు ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మండిపడ్డారు. పీకే ఇది బెంగాల్ కాదు. మీ కుట్రలు ఈ తెలంగాణలో పని చేయవని హెచ్చరించారు.